ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు నిర్ణయం .. కొంత మంది కీలక నేతల్లో జగన్మోహన్ రెడ్డిపై ఇంత కాలం చూపించిన అభిమానం కూడా మాయమైంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తే చాలు ఇతరులపై దారుణమైన బండ బూతులతో విరుచుకుపడేవారు కూడా ఇప్పుడు సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల్ని ఎలా సమర్థించాలని ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకోవాలని మథనపడుతున్నారు. పిచ్చి చేష్టలను ప్రజలకు ఎలా మంచివని చెప్పాలని వారు టెన్షన్ పడుతున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి రెండు, మూడు రోజులుగా బయట కనిపించడం లేదు. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మారుస్తున్నారని తెలిసిన తర్వాత చివరి రోజు ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. అసెంబ్లీలో పేరు మార్పునకు మద్దతుగా మాట్లాడాలని … ఆయనకు సమాచారం కూడా వచ్చింది. కానీ ఎన్టీఆర్ పేరు మార్పును తాను ఎలా సమర్థిస్తానంటూ ఆయన సైలెంట్ గా ఉన్నారు. దీంతో టార్గెటెడ్ సామాజికవర్గం నుంచి ఒక్కరితో కూడా మాట్లాడించలేకపోయారు. అదే సమయంలో ఆ మాజీ మంత్రి తన సన్నిహితుల వద్ద సీఎం జగన్పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మా నాయకుడి పిచ్చి చేష్టలతో నియోజకవర్గంలో.. జిల్లాలో కమ్యూనిటీకి సమాధానం చెప్పుకోలేకపోతున్నానని సదరు మాజీ మంత్రి సన్నిహితుల వద్ద నేరుగానే అంటున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం రాజకీయాల్లో ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఎంత తిట్టమన్నా తిట్టొచ్చు కానీ సాక్షాత్తూ ఎన్టీఆర్ పేరు తీసేయడం లాంటి చర్యలు చేస్తే వైసీపీలో ఉన్న మా సామాజికవర్గ నేతలకు స్థానికంగా ఇబ్బందులు పెరుగుతాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజు ఏ పిచ్చి చర్యలు చేస్తాడో.. ఎలా డిఫెండ్ చేయాలో తెలియక తల పట్టుకోవాల్సి వస్తుందని ఆయన అంతర్గతంగా తనదైన భాషను ప్రయోగిస్తున్నారని అంటున్నారు.
మొత్తంగా ఎంతో విశ్వాసం చూపించిన నేతలను కూడా పక్కాగా వాడేసుకుని సామాజికవర్గ కుంపట్లు రాజేసేందుకు వెనుకాడని జగన్ తీరు ఇప్పుడిప్పుడే కొంత మంది మంత్రులకు కనువిప్పు అవుతోంది.