తెలంగాణ బీజేపీ నేతలు అతి చేస్తున్నారు. సాధారణంగా అధికార పార్టీ అలాంటి అతి చేస్తుంది. కానీ మునుగోడులో బీజేపీ నేతలు చేస్తున్నారు. గెలిచి తీరాలన్న పట్టుదలతో .. ద్వితీయ శ్రేణి నేతల్నిపార్టీలో చేర్చుకునేందుకు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. లంచాలిస్తున్నారు. ఈ కారణంగా వారంతా పూటకో పార్టీలో ఉంటున్నారు. మరో వైపు బీజేపీ .. మండలానికి ముగ్గురు ఇంచార్జుల్ని పెట్టి.. వందల మందిని బయట నుంచి తెచ్చి మునుగోడులో మోహరిస్తున్నారు.
సాధారణ ఎన్నికల ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నికను భావిస్తున్నారు. అందుకే భారీగా నేతల్ని మోహరించి ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఓటర్లు అందర్నీ ఓ సారి కలవాలని.. షెడ్యూల్ వచ్చిన తర్వాత మరో రెండు సార్లు కలిసి ఓటు అభ్యర్థించాలని నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నిక కోసం ఛార్జ్ షీట్ తో పాటు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఏడాది పాటు పదవీ కాలం లేని ఎన్నిక కోసం బీజేపీ నేతలు ఇంతలా ఎలా ఖర్చు పెడుతున్నారనిప్రజలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇంకా ఎన్నికల షెడ్యూలే రాలేదు.. అందుకే జనం కూడా బీజేపీ తీరుపై ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణ కోసమో.. ప్రజల కోసమో రాజగోపాల్ రెడ్డి .. బీజేపీలో చేరారని ఒక్క శాతం కూడా నమ్మడం లేదు. ఆయన పూర్తిగా డబ్బునే నమ్ముకున్నారు. కేంద్రంలో ఉన్న అధికార బలాన్ని నమ్ముకున్నారు. కానీ ఇది మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలందరికీ డబ్బులిచ్చి చేర్చుకున్నా.. చివరికి వారు కూడా ఓట్లేస్తారో లేదో తెలియని పరిస్థితి. మునుగోడును ముట్టడించేలా బీజేపీ చేస్తున్న వ్యూహం.. ఆ పార్టీపై వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతోంది.