అప్పల్రాజు వైద్య ఆరోగ్య మంత్రి కాదు. కానీ ఆయన పలాస ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అక్కడ ఆయన రచ్చ రచ్చ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అత్యంత దారుణంగా ఉందన్నట్లుగా మాట్లాడారు. పలాస ఆస్పత్రిలో ఒక్క వైద్యుడు కూడా లేని సమయం చూసి ఆయన చెకింగ్‌కు వెళ్లారు. మీడియానూ తీసుకెళ్లారు. అక్కడి పరిస్థితుల్ని హైలెట్ చేశారు. మీడియాకు చెప్పాలనుకున్నది చెప్పారు. ఆయన మాటల్లో ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఘోరంగా ఉంది.. ఆస్పత్రిలో ఎలాంటి సేవలు అందడం లేదు. ఈరుకునేది లేదు… అందరికీ ఫిర్యాదు చేస్తానన్న సారాంశం ఉంది.
అప్పల్రాజు మంత్రి కంటే ముందే వైద్యుడు. ఆయనకు పలాసలో ఆస్పత్రి కూడా ఉంది. ఆయనకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ఎలా ఉంటుందో తెలుసు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలుసు. అయినా సరే ఉద్దేశపూర్వకంగా మీడియాను తీసుకెళ్లారు. ఆయనొస్తారని తెలిస్తే అందరూ ఉండేవాళ్లు. కాస్త బ్లీచింగ్ చల్లి.. రోగులకు వైద్యం చేస్తున్నట్లుగా కనిపించేవాళ్లు. కానీ మీడియాకు మాత్రమే చెప్పి.. ఆస్పత్రి వర్గాలకు చెప్పకుండా రావడంతో అవేమీ సాధ్యం కాలేదు.
పలాస ఎమ్మెల్యే అయిన సీదిరి అప్పలరాజుకు అన్నీ తెలుసని .. తెలిసినా తెలియనట్లుగా గేమ్ ఆడుతున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. పలాస ఆస్పత్రి పనితీరు గురించి ఆ ఊరి ప్రజలందరికీ తెలుసని..అందరూ అలవాటుపడిపోయారని రోగులంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం ప్రపంచస్థాయిలో మందని ఆ శాఖ మంత్రి విడదల రజనీ తరచూ చెబుతూంటారు. ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వైద్యం చేసేలా పరిస్థితుల్ని మార్చామని చెబుతూంటారు. కానీ అప్పల్రాజు ఆ గాలి తీసేశారు. అయితే మంత్రి గారు ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గొణుక్కునే వారు కూడా ఉన్నారు.