ఈ దసరాకి నాగార్జున సందడి చేయబోతున్నాడు .. ది ఘోస్ట్ సినిమాతో. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ఇది. దీనిపై నాగ్ చాలా నమ్మకం పెట్టుకొన్నాడు. పైగా.. అక్టోబరు 5… తనకు బాగా కలిసొచ్చింది. అక్టోబరు 5నే.. `శివ` విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కూడా `ఘోస్ట్`కి హిట్ పడుతుందని నాగ్ నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఈ రెండు సినిమాలకూ పోలిక కూడా తీసుకొస్తున్నాడు. `ఘోస్ట్` ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా శివని మరోసారి గుర్తు చేసుకొన్నాడు నాగ్.
”శివలో చైను పట్టుకొచ్చా. ఆ సినిమా గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు ఘోస్ట్ కోసం కత్తి పట్టాను. శివ విడుదలైన తరవాత సౌండ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఘోస్ట్ చూశాక విజువల్స్, యాక్షన్ గురించి కూడా అలానే మాట్లాడుకొంటారు. ఇది వరకు చాలా సినిమాల్లో గన్స్ పట్టుకొని యాక్షన్ సీన్స్ చేశా. కానీ.. ఆ సినిమాలు వేరు, ఘోస్ట్ వేరు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకొన్నా” అని చెప్పుకొచ్చాడు నాగ్. అక్టోబరు 5నే విడుదల కాబోతున్న మరో సినిమా గాడ్ ఫాదర్‌కి కూడా విజయం దక్కాలని ఆయన కోరుకొన్నారు. “నాకు అత్యంత ఆప్తుడు చిరంజీవి గారి సినిమా కూడా అదే రోజున విడుదల అవుతోంది. రెండు చిత్రాలకూ విజయం దక్కాల“న్నారు నాగ్. ఇదే వేదికపై నాగచైతన్య, అఖిల్‌లు కూడా సందడి చేశారు.