మూడు రాజధానులు అంటే సమర్థిస్తున్నవారు ఏపీలోనే కొంత మంది ఉంటారు కానీ బయట ఎవరూ లేరు. ఎక్కువ మంది నవ్వుతున్నారు. అలాంటి వారి జాబితాలో తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరారు. చంద్రబాబు అన్నీ ఆలోచించే అమరావతిని నిర్ణయించారని.. జగన్ మూడు రాజధానులు పేరుతో దాన్ని నాశనం చేయడం ఏమిటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే అధికారంలోకి వచ్చాక కూడా ఫ్యాక్షన్ పద్దతిలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. హెల్త్ వర్శిటీకి పేరు మార్పు అంశాన్ని కూడా తప్పు పట్టారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం అంటే.. తెలుగు వాళ్లందర్నీ అవమానించడమేనన్నారు.
నిజానికి జగ్గారెడ్డి కూడా వైఎస్ఆర్ అభిమానే. ఆయన ఆకర్ష్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకి. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దగ్గరని చెప్పుకుంటారు. అయినా సరే జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. షర్మిల తెలంగాణలో చేస్తున్న వ్యాఖ్యలపైనా ఘాటుగా స్పందించారు జగన్ వదిలేసిన బాణం అని సెటైర్ వేశారు. వైఎస్ఆర్ అంటే తమకు అభిమానమని అయితే ఆయన కుమార్తె వచ్చి తిడుతూంటే పడాలా అని ప్రశ్నించారు. ఆమె బీజేపీని తప్ప అందర్నీ తిడుతున్నారన్నారు. బీజేపీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
జగన్, షర్మిల ఇద్దరూ బీజేపీ తొత్తులేనని వారు ఏమీ చెబితే అది చేస్తున్నారన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు సహజంగానే రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. జగ్గారెడ్డి ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా మాట్లాడే నేత. అందుకే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో తెలంగాణ ఉద్యమం ఎగసిపడిన సమయంలో.. సమైక్యాంధ్ర అంటే దాడులు చేసే రాజకీయ వాతావరణం ఉన్న సమయంలోనూ ఆయన సమైక్యాంధ్రకే తన మద్దతని ప్రకటించారు. ఇప్పుడు జగన్‌పై వ్యాఖ్యలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.