వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె .. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. సొంత కుటుంబంలోనే అత్యంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్నారు. తమపై ప్రైవేటు కేసులు పెడుతన్నారు .. ఎదురు ఆరోపణలు చేస్తున్నారు… అయినా సరే ఎక్కడా తగ్గడం లేదు. తమ పోరాట పంథాలో తాను ఉన్నారు . ఇలా పోరాడుతున్నందుకు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లుపై ఆమె వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం చేస్తున్నారు.
తన తండ్రి హంతకులకు శిక్ష పడటానికి ఆమె చేస్తున్న పోరాటానికి.. రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధం ఏమిటో సజ్జల లాంటి వారే చెప్పాలి…కానీ సునీతారెడ్డి మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదని ఖండించడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆమెను వైఎస్ భారతి నేతృత్వంలోని సాక్షి మీడియా బ్యాన్ చేసింది. కానీ ఇతర మీడియాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ మీడియాలకు ఇస్తున్న ఇంటర్యూల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తే అది వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలికకు దారి తీసే అవకాశం ఉందని పులివెందులలో చర్చ జరుగుతోంది. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు జగన్ వెంట ఉంది. మిగిలిన వారంతా దూరమయ్యారు. జగన్ తమను పట్టించుకోవడం లేదని వారనుకుంటున్నారు. వారిని ఐక్యంగా ఉంచడంలో జగన్ విఫలమయ్యారని చెబుతున్నారు. అందుకే సునీత రాజకీయ రంగ ప్రవేశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా ఆమె చెబుతూండటంతో మరింత ఆసక్తి రేపుతోంది.