తెలంగాణ సీఎం కేసీఆర్ ఐ ప్యాక్ ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టారు. గతంలో గొప్పగా పొగిడారు కానీ ప్రత్యక్షంగా వారి సర్వీసులు అందుకున్న తరవాత… తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకుంటున్నామేమో అన్న అనుమానంతో ఇక చాలని చెప్పేశారు. కాంట్రాక్ట్ కుదిరింది కాబట్టి. .. సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌కు మాత్రం ఉంచుకున్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టడానికే ఇక తెలంగాణలో ఐ ప్యాక్ పరిమితమవుతుంది. ఇప్పుడు ఏపీలోనూ ఐ ప్యాక్ టీములపై వైసీపీ హైకమాండ్‌లో అసంతృప్తి ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో ఏ ఒక్క స్ట్రాటజీ సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా లేకపోతే ఎదురు తంతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా ఐ ప్యాక్ తీరుపై ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వానికి నేరుగా సేవలందించడానికి అంగీకిరంచిన ప్రశాంత్ కిషోర్ .. జగన్ కు మాత్రం నో చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా ఆయన సేవలను వద్దనుకుంది. అయినా జగన్ కు నేరుగా పని చేయడానికి ఆయన సిద్ధగా లేరు. ఆయన తరపున రిషిరాజ్ అనే వ్యక్తికి చాన్సిచ్చారు. అయితే ఆ రిషి రాజ్ పూర్తిగా పీకే … గత ఎన్నికలకు ముందు ఫాలో అయిన మోడల్‌ను అమలు చేస్తున్నారు. అప్పట్లో వైసీపీ ప్రతిపక్షం .. టీడీపీ అధికారపక్షం. ఇప్పుడు వైసీపీ అధికారపక్షం. ఆ మోడల్ అమలు చేస్తే రివర్స్ అవుతుంది కానీ ప్లస్ కాదు. ఈ లాజిక్ ను మిస్సయ్యారని అందుకే వాళ్ల స్ట్రాటజీలో వర్కవుట్ అవ్వడం లేదన్న అభిప్రాయంలో వైసీపీ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు.
సోషల్ మీడియాలోనూ బాగా వెనుకబడిపోయామన్న ఫీలింగ్ వైసీపీ హైకమాండ్‌లో ఉంది. ఇటీవలి కాలంలో జగన్ ప్రత్యేకంగా సోషల్ మీడియాపై సమీక్షలు చేసి ఇంచార్జులను కూడా మార్చారు. అయితే ఐ ప్యాక్ టీం సరైన సలహాలు ఇవ్వలేకపోవడంతో కోలుకున్న సందర్భాలు ఉండటం లేదు. అసలు సోషల్ మీడియా బలమే ఐ ప్యాక్ కు కీలకం. కానీ ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ఫేక్ అకౌంట్లతో పాటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఇతరులకు పేమెంట్ పద్దతిలో ట్వీట్లు చేసేందుకు హైర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా రెస్పాన్స్ ఉండటం లేదు.
అదే సమయంలో వారు చేస్తున్న సర్వేలు లీకవుతున్నాయి. చెత్త సలహాలతో పార్టీలో చిచ్చు పెడుతున్నారన్న ఆందోళనా కనిపిస్తోంది. మొత్తంగా పీకే టీంపై ఎక్కువ ఆధారపడితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కేసీఆర్ మొహమాటానికి పోకుండా గుడ్ బై చెప్పారు. కానీ జగన్‌కు మాత్రం కాస్త మొహమాటంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.