టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గూడు కట్టుకుపోయిన ఈడీ భయం మెల్లగా నిజమవుతోంది. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి వచ్చే వరకూ ఆయనకు నోటీసులు వచ్చిన విషయం కూడా బయటకు తెలియదు. దీంతో ఆయనను ఏ కేసులో విచారణకు పిలిచారన్నదానిపై ఆసక్తి ప్రారంభమయింది.
ఇటీవలి కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ అధికారులు విస్తృతమైన సోదాలు నిర్వహించారు. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కేసులోనే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పిలిచి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కానీ ఆయనకు సంబంధం ఉన్న కంపెనీల పేర్లు కానీ ఎప్పుడూ బయటకు రాలేదు. ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని.. అందుకే ఆయనను పిలిపించారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ హవాలా దందానూ కూడా భారీ ఎత్తున చేపట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇండోనేషియాలోని బంగారు గనుల్లో మంచిరెడ్డికి పెట్టుబడులు ఉన్నాయని చెబుతున్నారు. ఆ పెట్టుబడుల్ని ఎలా తరలించారు.. అన్న అంశాన్ని విచారించేందుకే ఈడీ పీలిచిందని..చెబుతున్నారు. కారణం ఏదైనా తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో ఈడీ భయం ఎక్కువగా ఉంది. అందుకే మంచిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.