విశాఖపట్నానికి రైల్వేజోన్ వచ్చి తీరుతుందని రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భీకర ప్రతిజ్ఞ చేశారు. విభజన సమస్యల పరిష్కారంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో రైల్వేజోన్ లాభదాయకం కాదని ఇచ్చే అవకాశం లేదని తేల్చేసినప్పుడు సైలెంట్‌గా ఉన్నారు ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన వారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ మాత్రం భీకరమైన ప్రతిజ్ఞలు చేస్తున్నారు. నిన్న కేంద్ర హోంశాఖ సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని విజయసాయిరెడ్డి చెప్పుకొస్తున్నారు. ఒక వర్గం మీడియా కావాలనే వైసీపీ ని ఇబ్బంది పెట్టేలా రైల్వే జోన్ పై తప్పుడు రాతలు రాస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని స్వయంగా కేంద్ర రైల్వే శాఖామంత్రి తనతో చెప్పారని విజయసాయిరెడ్డి నమ్మకంగా చెబుతున్నారు. రైల్వే జోన్ వ్యక్తుల మధ్య సమస్య కాదు. రైల్వే మంత్రి , విజయసాయిరెడ్డి గుసగుసలాడుకుని.. ఇచ్చేస్తామని చెప్పుకోవడానికి. అధికారికంగా జరిగేదే అసలైన విషయం. ఐదేళ్ల కిందటే .. రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నా ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు. నాలుగేళ్ల నుంచి ముఫ్ఫై మందికిపైగా ఉన్న వైసీపీ ఎంపీలు.. ఇచ్చిన రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయించడంలోనూ విఫలమయ్యారు.
ఇప్పుడు ఆ రైల్వే జోన్ కూడా ఉండదని.. చెబుతూండటంతో.. ఎంపీలు సిగ్గుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి రైల్వేజోన్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. ఎప్పట్లో జోన్ ఇస్తారో … ఆయనే టైమ్ లైన్ పెట్టి.. ఈ ప్రతిజ్ఞ చేసి ఉండాల్సింది. అలాంటిదేమీ లేకుండా ప్రజల్ని మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేయడం . అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.