పరిస్థితులు కలిసి రాకపోయినా ముందుకే వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో భారీ బహిరంగసభ పెట్టి పార్టీ ప్రకటన చేయాలనుకున్న ఆయనకు ఏదీ కలసి రావడం లేదు. దీంతో మంచి రోజు అని విజయదశమి రోజున పార్టీ పేరు మాత్రం ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయాలని పండితులతో ముహుర్తం ఖరారు చేయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అదే రోజున టీఆర్ఎస్ఎల్పీ భేటీ నిర్వహిస్తారు. అందరి ఆమోదంతో జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఏకాభిప్రాయం మేరకు… పార్టీ ప్రకటన ఉంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్వయంగా తీర్మానాలు చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు కీలక నేతలు.., కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రకటనలు చేస్తున్నారు. గతంలో జాతీయ నేతలందర్నీ పిలిచి కనీ వినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించి జాతీయ పార్టీ ప్రకటన చేయాలనుకున్నారు కేసీఆర్. అయితే ఈ సారి పార్టీ పరమైన ప్రకటన మాత్రం ముహుర్తం ప్రకారం చేసి ఆ తర్వాత బహిరంగసభ నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రాంతీయ పార్టీలన్నింటితో కూటమి కట్టడం ద్వారా ఆయన ఢిల్లీ రాజకీయాలు చేయాలనుకున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల నేతలు తమ తమ రాష్ట్రాల్లో.. తమ పార్టీల ప్రయోజనాల పరంగా చూసుకుని ఎక్కువగా జాతీయ పార్టీలతో కలిసేందుకే మొగ్గు చూపుతున్నాయి. దీంతో కేసీఆర్ రైతు సంఘాల నాయకులతను రాజకీయాల్లోకి తెచ్చి .. జాతీయ పార్టీ ప్రకటన చేయాలని అనుకుంటున్నారు.