ముగ్గురు నలుగురు మంత్రుల్ని మారుస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో జగన్ నలుగురు మంత్రుల పేర్లు చెప్పి మరీ హెచ్చరికలు జారీ చేయడం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్నిసీరియస్‌గా తీసుకోడం లేదని .. మొత్తం 27మందిపై జగన్ ఫైరయ్యారు. అందులో నలుగురు మంత్రులు ఉన్నారు. వీరందరూ ఇక నుంచి వారానికి మూడునాలుగు రోజులు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాల్సిందేననిస్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఓ గంట తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని.. వారందరి పనితీరుపై మదింపు చేస్తున్నామని.. పనితీరు మార్చుకోపతే టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు. ప్రజాసేవనే వృత్తిగా తీసుకోవాలని జగన్ వారికి స్పష్టం చేశారు.
నవంబర్ ఆఖరి వారంలో మరోసారి మీటింగ్ ఉంటుందని ఎవరి పని తీరు ఏంటి అనేది చివరి ఆరు నెలల్లో చెబుతానని.. అప్పుడే టిక్కెట్లు ఇచ్చేది లేనిది కూడా చెబుతామని జగన్ స్పష్టం చేశారు. మాజీ మంత్రులు బాలినేని, అళ్ల నాని పని తీరు పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని దొంగదారులు వెతకవద్దని జగన్ వారికి మొహం మీదనే చెప్పారు. నలుగురు మంత్రులు..మాజీ మంత్రులు కాకుండా జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల్లో.. గ్రంధి శ్రీను, ధనలక్ష్మి, అధిప్ రాజ్, కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి, మేకపాటి చంద్రశఖరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంచి నేతలు ఉన్నారు.
అయితే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తాము గడప గడపకూ సీరియస్‌గానే వెళ్తున్నామని రోజూ అదే పని అంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కొంత మంది అసలు వెళ్లకపోయినా రిపోర్టుల్లో వాళ్ల పేర్లు లేవని గుసగుసలాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓ వ్యూహం ప్రకారం ఇలా పేర్లు చెబుతున్నారని.. వాళ్ల నుంచి మరింత విధేయత ఆయన కోరుకుంటున్నారన్న అర్థమని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. విధేయత అంటే… ఇతర పార్టీల నేతల్ని తిట్టడమేనని.. జగన్ వెల్లడించిన పేర్లలో అలాంటి వారే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు.