చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రిరిలీజ్ ఈవెంట్ కోసం అనంతపురంని వేదికగా చేసుకున్నారు. భారీ సెట్ వేశారు. వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఎంతో కలర్ ఫుల్ గా జరగాల్సిన ఈ ఈవెంట్ వర్షార్పణం అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఈ గ్యాప్ లో డ్యాన్సులు సాంగ్స్ తో టైం పాస్ చేశారు. అయితే చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన పది నిమిషాలకే వర్షం దంచికొట్టింది. దీంతో సడన్ గా ఈవెంట్ ని ముగించేయాల్సి వచ్చింది. దర్శకుడు మిగతా నటులు ఎవరూ మాట్లాడలేదు. అయితే అంతటి వర్షంలో కూడా కొందరు అభిమానులు ఈవెంట్ లో నిలబడ్డారు. అటు చిరు కూడా వర్షంలో కూడా ఓపిక తెచ్చుకొని చాలా సుదీర్గంగా మాట్లాడారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. తాను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుందని, ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామంగా చెప్పారు.
గాడ్ ఫాదర్ లో పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా వుంటుంది. ఈ రెండు కలసి ప్రేక్షకులుని ఆద్యంతం అలరిస్తుంది. సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది. మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దీనికి సమాధానమే ఈ సినిమా. గాడ్ ఫాదర్ నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. అలాగే అదే రోజు నా మిత్రుడు నటించిన నాగార్జున ది ఘోస్ట్, యువ హీరో గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలి’ అని కోరారు చిరు. ఏదేమైనా ఎంతో కలర్ ఫుల్ గా జరగాల్సిన ఈ వేడుకని వరుణుడు దెబ్బకొట్టాడు.