తప్పేంటి ? అనేది మంత్రి బొత్స ఊతపదమో.. లేకపోతే ఎదురుదాడో తెలియదు కానీ అసువుగా వాడేస్తారు. తాజాగా విశాఖలోసీఎం క్యాంపాఫీస్ నిర్మిస్తే తప్పేమిటని అసువుగా జర్నలిస్టుల్ని ఎదురు ప్రశ్నించేశారు. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. రుషికొండను పూర్తిగా ధ్వంసం చేసి కడుతున్నది సీఎం అధికార నివాసం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది హోటల్అని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం తీసుకున్న ప్లాన్ మాత్రం హోటల్ కు తగ్గట్లుగా లేదు. అందుకే అనుమానాలున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినా సరే.. కొండను తొలుస్తూ నిర్మాణ పనులు చేస్తూనే ఉన్నారు.
ఇలా ఎందుకు చేస్తున్నారన్నదానికి సమాధానం చెప్పే వారు లేరు కానీ.. సీఎం అధికారిక నివాసం నిర్మిస్తే తప్పేంటి అని బొత్స ప్రశ్నిస్తున్నారు. కానీ దొంగతనంగా.. తప్పుడు పేర్లతో.. తప్పుడు ప్రాజెక్టుల పేర్లతో కట్టడమే తప్పని మంత్రిగారు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో తెలియదు కానీ.. ఆయన వాదనలు మాత్రం తమ సొంత ఇల్లేదో రహస్యంగా కట్టుకుంటున్నట్లుగా ఉంటాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని రహస్యంగా నిర్మిస్తే అంత కంటే దౌర్భాగ్యం మరొకటి ఉందు. ప్రజలకు చెప్పి కట్టాలి. ఎదుకంటే అది ప్రజాధనంతో కట్టేది. ఏదో గూడుపుఠాణి చేసినట్లుగా చేస్తే అది పరిపాలన ఎందుకు అవుతుంది.
ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఎదైనా చేస్తామన్నట్లుగా తీరు ఉంది. కానీ అధికారం పొందేందుకు చెప్పింది ఒకటి.. తర్వాత చేస్తోంది ఒకటి అయితే.. ఆ ప్రజలు మద్దతుగా ఉన్నారని చెప్పడంలో అర్థం లేదు. కానీ వైసీపీ నేతలు ఈ విషయంలో రాటుదేలిపోయారు. మూడు రాజధానులు చేస్తే తప్పేంటి ? రాజధాని రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటే తప్పేంటి ? కుల పరమైన వ్యాఖ్యలు చేస్తే తప్పేంటి ? రోడ్లు వేయకపోతే తప్పేంటి ? అభివృద్ది చేయకపోతే తప్పేంటి ? .. టీడీపీ వాళ్లకు పథకాలివ్వకపోతే తప్పేంటి ? అని వాదించుకుంటూ పోతే.. ప్రజాస్వామ్యంలో చివరికి ప్రజలు చెప్పాల్సింది చెబుతారు.