గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి ముఖ్యంగా ఏపీ ప్రజలకు… జగన్ కేసులే గుర్తుకు వస్తున్నాయి. ఎందుకంటే గాలి జనార్ధన్ రెడ్డి ఎలా అయితే కేసుల విచారణ నుంచి తప్పించుకుంటున్నారో జగన్ కూడా అంతే. పది.. పన్నెండేళ్ల పాటు అసలు విచారణలే జరగడం లేదు. అన్నీ డిశ్చార్జ్ పిటిషన్లు… ఇతర పిటిషన్లు వేస్తూ విచారణ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకా విశేషం ఏమిటంటే గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించారని సీబీఐ చెబుతోంది.
మరి అలాంటప్పుడు బెయిల్ రద్దు పిటిషన్ ఎందుకు వేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో సీబీఐకి ఏంచెప్పాలో తెలియడం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కంటే దారుణంగా బెయిల్ నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు జగన్. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో సీబీఐ నిజాలను చెప్పడానికి భయపడింది. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టుకే వదిలేసింది.
ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులపై సుప్రీంకోర్టులో విచారణ తీరు చూసిన తర్వాత సీబీఐ మనసు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయం..పలుకుబడి ఉన్న వాళ్లకి ఒకలా ఉంటోందన్న అభిప్రాయానికి తెర దించాల్సిన సమయం ఆసన్నమయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గాలికో న్యాయం… జగన్‌కో న్యాయం కాకుండా ఇరువురికి సమాన న్యాయం ప్రకటిస్తూ… కేసుల విచారణ వేగవంతం చేసి… వీలైనంత త్వరగా వాటిలో మెరిట్ ను చూసి..తీర్పులు ఇవ్వాల్సి ఉంది. అది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.