Ponniyin Selvan 1 Telugu Review
తెలుగు360 రేటింగ్ : 2.5/5
ఒక తరానికి స్ఫూర్తినిచ్చిన దర్శకుడు మణిరత్నం. ఆయన సినిమాలకి ప్రత్యేకమైన స్థానం వుంది. ఒక ఫార్ములా ప్రకారం, బాక్సాఫీసు లెక్కలేసుకొని ఏనాడూ సినిమాలు చేయలేదాయన. ఆయన సినిమాలు కొన్ని క్లాసిక్ గా నిలిచాయి. మరికొన్ని విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇంకొన్ని నిరాశ పరిచాయి. అయితే ఫలితం ఎలా వున్నా ఆయన సినిమాలపై గౌరవం మాత్రం తగ్గలేదు. అందుకే మణిరత్నం నుంచి సినిమా వస్తుందంటే సినీ ప్రేమికుల్లో ఒక ఆసక్తి. ఇప్పుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం కల మాత్రమే కాదు.. తమిళ చిత్ర పరిశ్రమ కల. దక్షిణ పథాన్ని పరిపాలించిన చోళుల ఇతివృత్తంగా కల్కి కృష్ణమూర్తి రాసిన 2,210 పేజీల భారీ నవల ‘పొన్నియిన్ సెల్వన్’. అప్పట్లో తమిళనాట ఈ నవల ఒక సంచలనం. చరిత్రకు తన కల్పన కొంత జోడించి కల్కి రాసిన ఈ నవల పాఠకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఎంజీఆర్ మొదలుకొని కమల్ హసన్ వరకూ చాలా మంది ఈ నవలకు వెండితెర రూపం ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు మణిరత్నం ఆ కలని సాకారం చేస్తూ పొన్నియిన్ సెల్వన్ ని రెండు భాగాలు చిత్రీకరించారు. మణిరత్నం కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రమిది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఇలా భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ట్రైలర్ సినిమాని చూడాలనే ఆసక్తిని కలిగించింది. మరి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి తీసిన ఈ చిత్రం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది ? నవలగా ఆకట్టుకున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాగా ఎలా అలరించింది ? ఈ హిస్టారికల్ ఫిక్షన్ ని వెండితెరపై మణిరత్నం ఎలా ఆవిష్కరించారు?
వెయ్యేళ్ళ క్రితం చోళ సామ్రాజ్యానికి రాజు సుందర చోళుడు (ప్రకాష్ రాజు). అనారోగ్యంతో సుందర చోళుడు మంచాన పడతాడు. సుందర చోళుడుకి ఇద్దరు కుమారులు.. ఆదిత్య కరికాలన్ (విక్రమ్), ఆరుళ్ మోళి (జయం రవి). ఆదిత్య కరికాలన్ వీరుడు. యుద్ధాలు చేసి రాజ్యాలని చోళ సామ్రాజ్యంలో కలుపుకొని రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు. పాండ్యులని ఊచకోత కోస్తాడు. ఆరుళ్ మోళి రాజనీతి తెలిసినవాడు. ఇతడ్నే ప్రజలు యువరాజు పొన్నియిన్ సెల్వన్ గా పిలుస్తారు. చోళ
సామ్రాజ్యానికి కోశాధికారి పళవేట్టరాయర్ (శరత్ కుమార్). పళవేట్టరాయర్ భార్య నందిని( ఐశ్వర్యరాయ్). వీరిద్దరూ సుందర చోళుడు తో కలసి తంజావూరు కోటలో వుంటారు. చోళ సామ్రాజ్యానికి ముంపు పొంచివుందని వేగుల ద్వారా ఆదిత్య కరికాలన్ కి ఒక వార్త అందుతుంది. ఆదిత్యకు అత్యంత నమ్మకస్తుడైన సైనికుడు వల్లవరాయన్ వందిదేవన్ (కార్తి). తమపై జరుగుతున్న కుట్రని పసిగట్టమని వందిదేవన్ ని గూడచారిగా పంపిస్తాడు ఆదిత్య. గూఢచారిగా వెళ్ళిన వందిదేవన్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? చోళులపై కుట్ర చేస్తున్నది ఎవరు ? ఆదిత్య, నందినిలకు మధ్య వున్న గతం ఏమిటి ? అనేది మిగిలిన కథ.
చరిత్ర చాలా మందికి బోరింగ్ టాపిక్. కానీ రాజుల కథలు మాత్రం ఆసక్తికరంగా వుంటాయి.యుద్ధం,ప్రేమ, కుట్రలు, వ్యామోహాలు, అక్రమ సంతానాల పగలు..ఇవన్నీ రాజుల కథల్లో చాలా ఆసక్తిని రేపుతాయి. పొన్నియిన్ సెల్వన్ కథ కూడా ఒక రాజ్యం కథే. ఇలాంటి కథని మణిరత్నం లాంటి దర్శకుడు తీసున్నపుడు ఖచ్చితంగా అందులో వైవిధ్యం ఆశిస్తాం. అందులోనూ ఒక పాపులర్ నవలని సినిమాగా చేస్తున్నప్పుడు మణిరత్నం లాంటి దర్శకుడిని ఎక్సయిట్ చేసిన పాయింట్ ఆ నవలలో ఏముందోనని ఎదురు చూస్తాం. మరి ఈ నవలలో ఆయనకి ఎక్సయిట్ చేసిన పాయింట్ ఏమిటో గానీ తెరపై చూస్తునప్పుడు మాత్రం పెద్ద ఎక్సయిట్ మెంట్ ని ఇవ్వలేకపోయింది పొన్నియిన్ సెల్వన్.
2,210 పేజీల భారీ నవలలో ఎన్ని పాత్రలు వున్నాయో కానీ సినిమాలో మాత్రం పాత్రల మధ్య పెద్ద గందరగోళమే జరిగింది. పైగా పూర్తిగా తమిళ్ నేటివిటీ వున్న చరిత్ర కావడంతో పాత్రల పేర్లు, ప్రదేశాలపై ఒక క్లారిటీ రావడానికి చాలా సమయం పడుతుంది. వందిదేవన్ ప్రయాణంలో చోళ సామ్రాజ్యాన్ని ఆవిష్కరించుకుంటూ వెళ్లారు మణిరత్నం. వందిదేవన్ ఒక్కో ప్రాంతం ప్రదేశం తిరుగుతూ ఉంటాడు. తెరపై ఒక్కో పాత్ర పరిచమౌతుంటుంది. అయితే చాలా వరకూ డిటేయిల్ గా వుండవు. దీంతో లింకులు మిస్ అవుతున్న భావన కలుగుతుంది.
కల్కి రాసిన ఈ నవల అప్పటికి ఫ్రెష్ అడ్వంచర్ ఫీలింగ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ అందులో వున్న సన్నివేశాలు ఇదివరకే చాలా రాజు కథల్లో చూసేశాం. వందిదేవన్ పాత్రలో సాహసాలు ఉన్నప్పటికీ అవేవీ కొత్త అనుభూతిని ఇవ్వవు. చోళ రాజుల పై కుట్ర పన్నడం కూడా పాత టెంప్లెట్ నే. ఇందులో వున్న మరో ప్రధాన సమస్య బలమైన విలన్ లేకపోవడం. ఈ కథలో చోళులని హీరోలు అనుకుంటే పాండ్యులు విలన్స్. చోళుల తరపున విక్రమ్, జయంరవి, కార్తి లాంటి పాత్రలు వుంటాయి. అటు పాండ్యుల వైపు బలమైన శత్రువు వుండదు. దీంతో యుద్ధాలన్నీ గాల్లో కత్తులు దూసుకున్నట్లుగా వుంటుంది.
ఇది చోళుల చరిత్ర. కల్కి నవల లో చాలా కల్పితం వుంది. దాన్ని సినిమాగా తీసున్నపుడు ఈ సమయానికితగ్గట్టు కొంత క్రియేటివ్ వర్క్ చేయాల్సింది. కానీ ఆలాంటి వర్క్ ఇందులో కనిపించదు. చెప్పడానికి చాలా ఎక్కువ కంటెంట్ వున్నపుడు ఆ కంటెంట్ తో డ్రామాని నడపాలి. రెండో భాగంపై ఆసక్తిని పెంచాయి. కానీ మణిరత్నం ఆ దిశగా అలోచించలేదు. దీన్ని అన్నదమ్ముల కథగా నడిపినా ఫలితం మరోలా వుండేది. ప్రధమార్ధంలో ఆదిత్యని పరిచయం చేసి రెండో సగంలో ఆరుళ్ పాత్రని తెరపైకి తెచ్చారు. వారి మధ్య కూడా ఎలాంటి బాండింగ్ వుండదు. నందిని, ఆదిత్యల మధ్య కరిగే కథలో ఇందులో కీలకం. అయితే ఆ ట్రాక్ ని ఒకే ఒక పాటలో ఇమిడ్చి చాలా సాధారణంగా తేల్చేశాడు. వారి మధ్య సన్నివేశాలు బలంగా రాసుకొని వుంటే .. సెకండ్ పార్ట్ పై మరింత ఆసక్తిపెరిగేది. అయితే నందిని పాత్రతో చివర్లో చిన్న ట్విస్ట్ మాత్రం ఓకే అనిపించింది. అది ఎవరూ ఊహించనిదే. అయితే ఇలాంటి ములుపు ఇంకొన్ని రాసుకొనివుంటే గ్రిప్పింగా వుండేది.
ఇది చోళుల కథ. కానీ ప్రధమార్ధం అంతా వందిదేవన్ పాత్రలో కార్తినే మెరుస్తాడు. కథని నడిపే పాత్ర దక్కింది. చాలా సహజంగా తనదైన ఈజ్ తో చేశాడు. యాక్షన్ కంటే మంచి డైలాగులు పడ్డాయి. ఆదిత్య గా విక్రమ్ వీరుడిగా కనిపించాడు. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. జయం రవి ది టైటిల్ రోల్. అయితే అది సెకండ్ హాఫ్ కే పరిమితం చేశారు. నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ ఆకట్టుకుంది. రాజకీయం తెలాసిన తెలివైన పాత్రది. రెండో భాగానికి నందిని పాత్రే కీలకం కాబోతోందని అనిపిస్తోంది.త్రిష తెరపై అందంగా కనిపించింది. నందిని తర్వాత మరో బలమైన పాత్రిది. శరత్ కుమార్, ప్రకాష్ రాష్.. పార్ధిభన్ .. ఇలా అందరూ తమ అనుభవాన్ని చూపించారు.
చోళ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడంలో చాలా పరిమితులు పెట్టుకున్నారు. చాలా వరకూ ఇంటీరియర్ లోనే షూట్ చేశారు.సెకండ్ హాఫ్ ఒక సముద్రం ఒడ్డు, అడవిలోనే ముగిసిందనే భావన కలిగింది. క్లైమాక్స్ లో భారీ షిఫ్ యాక్షన్ సీక్వెన్స్ వుంది. అయితే అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అక్కడ అనవసరం అనిపిస్తుంది. కెమెరాపనితనం డీసెంట్ గా వుంది. రెహ్మాన్ పాటలు గుర్తుండవు కానీ కథలో చక్కగా కుదిరాయి. రీరికార్డింగ్ బావుంది. తనికెళ్ళ భరిణి మాటల్లో మెరపులు వున్నాయి. మణిరత్నం సినిమాకి ఒక స్పెషల్ మార్క్ వుంటుంది. అయితే పొన్నియిన్ సెల్వన్ మాత్రం సగటు రాజుల సినిమాలానే వుంటుంది తప్ప మణిరత్నం స్టాంప్ కనిపించకోవడం కొంత నిరాశని కలిగిస్తుంది.
తెలుగు360 రేటింగ్ : 2.5/5