విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశంపై వైసీపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు నాగార్జున ఇంచ్ కూడా కదల్లేదు. అలాంటి ఆలోచనలు.. ఆశలు .. పెట్టుకోవడం లేదని తేలిగ్గా తీసుకున్నారు. తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆయన విజయవాడ నుంచి వైసీపీ తరపున పోటీ అని వచ్చిన వార్తలపై కూడా లైట్‌గా స్పందించారు. అవేమీ కొత్తవి కాదని గత పదిహేనేళ్లుగా ప్రచారం చేస్తున్నారని కానీ.. తాను పోటీ చేసే చాన్స్ లేదన్నారు. అవన్నీ అవాస్తవాలని తేల్చేశారు.
విజయవాడ నుంచి పోటీకి గట్టి అభ్యర్థిని వెదుక్కోవడానికి వైసీపీ చాలా కష్టాలు పడుతోంది. బాగా డబ్బు చేసిన పారిశ్రామికవేత్తల్ని నిలబెట్టినా ప్రయోజనం కలగలేదు. అందుకే ఈ సారి డబ్బు ప్లస్ గ్లామర్ కలగలిసిన వాళ్లను నిలబెట్టాలని అనుకుంటోంది. నాగార్జున సరైన వ్యక్తి అని జగన్ భావించడంతో ఆయనను మెల్లగా రాజకీయాల వైపు లాగేందుకు తమ పార్టీ సోషల్ మీడియా.. టీడీపీ నేతలు కూలి మీడియాగా పిలిచే చానళ్లలో ఇన్ సైడ్ న్యూస్ పేరుతో కథనాలు వేయించారు. చివరికి అది నాగార్జున చెవిలో పడింది కానీ.. టెంప్ట్ అవకూడదని డిసైడయ్యారు.
జగన్ తనకు ఆప్తమిత్రుడని.. నాగార్జున చెప్పారు. గత ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి ఆర్థిక వనరులు సేకరించి పెట్టడంలో.. నాగార్జున కీలకంగా వ్యవహరించారని రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. మ్యాట్రిక్స్ ప్రసాద్ , జగన్ , నాగార్జున వ్యాపార భాగస్వాములుగా చెబుతూంటారు. అందుకే మంచి సంబంధాలున్నాయంటారు. అయితే తన నటనా జీవితాన్ని రాజకీయాల వైపు మళ్లించుకోవడానికి నాగార్జున ఏ మాత్రం ఆసక్తికరంగా లేరు. తన లైఫ్ స్టైల్‌కు.. రాజకీయాలు ఏ మాత్రం సరిపడవన్న క్లారిటీతో ఉన్నారు. ఎంత ఒత్తిళ్లు వచ్చినా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నారు.