సీఎం కేసీఆర్కు కోపం వచ్చింది. అది చిన్న కోపం కాదు. సీఎంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని స్థిరచిత్తంతో ఉండాల్సిన కేసీఆర్ ఒక్క సారిగా తన చేతిలో ఉన్న వినతి పత్రాన్ని విసిరికొట్టారు. అదీ కూడా సమస్యలు పరిష్కరించమని ఇచ్చిన వాళ్లపైనే. కేసీఆర్ ఆగ్రహంతో వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు బిత్తరపోయారు. ఆయన అలా స్పందిస్తారని వారు అనుకోలేదు. కేసీఆర్ కోపం చూసి వెంటనే పోలీసుల్ని వాళ్లను అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు.
వరంగల్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. అక్కడ కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొంత మంది వీఆర్ఎలు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. మామూలుగా అయితే తీసుకోరు..కానీ తీసుకోవడానికి కేసీఆర్ అంగీకరించారు. తీరా వారు వచ్చి వినతి పత్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఫైరయ్యారు. వినతిపత్రాన్ని వీఆర్ఏ సంఘం నాయకులపైకి విసిరారు. ‘‘డ్రామాలాడుతున్నారా’’ అంటూ కోపాన్ని వెళ్లగక్కారు.
వీఆర్ఏల సమస్య తెచ్చి పెట్టింది కేసీఆరే. ఇటీవల వారి సమస్యను పరిష్కరించేందుకు ఇతర విభాగాల్లో ఉద్యోగాలిస్తామని చెప్పారు. కానీ అదీ సక్రమంగా జరగడం లేదు. ఇటీవల కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురవుతోంది. ఈ కోపం వారిపై చూపించారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మామూలుగా అయితే సీఎం ఇలా చేయరని ఆయన మూడ్ బాగోలేదని అనుకుంటున్నారు.