ఏపీ ప్రభుత్వం జీతాలు అందరికీ ఇవ్వలేదు. సగం మందికి కూడా వచ్చాయో లేదో క్లారీటీ లేదు.రేపు మంగళవారం ఆర్బీఐలో రూ. రెండు వేల కోట్ల అప్పు కోసం ఇండెంట్ పెట్టారు. అవి వస్తే చెల్లిస్తారు. అయితే లెక్క ప్రకారం ఇప్పటికే అప్పుల పరిమితి ముగిసిపోయింది. ఇంకా నాలుగైదు వేల కోట్లు ఎక్కువే తీసుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణకు కనీసం రూ. పదివేల కోట్ల వరకూ అప్పులకు చాన్సివ్వలేదు. కానీ ఏపీ ఖాతాలో మాత్రం ప్రతీ నెలా మంగళవారం రెండు వేల కోట్లు పడేలా చూసుకుంటోంది. కేంద్రం దానికి అనుమతి ఇస్తోంది.
గతంలో అదనపు అప్పులకు పర్మిషన్లు ఇచ్చినట్లుగా కేంద్రం బహిరంగంగా ప్రకటించేది. కానీ ఇప్పుడు కేంద్రం కూడా అలాంటి ప్రకటన చేయడం లేదు. ముసుగులో అప్పులకు పర్మిషన్ ఇస్తోంది. దాన్ని చూపి ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చుకుంటోంది. కేంద్రం అదనపు రుణాలకు చాన్సివ్వకుండా.. ఏపీ అలా ఇండెంట్ పెట్టుకునే అవకాశం లభించదు. ఓ వైపు అప్పుల కుప్పగా రాష్ట్రం మారింది. బడ్జెట్లో చూపించిన లోటు .. ఐదు నెలల్లోనే కనిపిస్తోంది. అయినా కేంద్రం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది.
రాజకీయంగా వైసీపీతో పోరాడుతున్నట్లుగా రాష్ట్ర నేతలు చెబుతూంటారు కానీ.. కనీసం నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం నడుచుకునేలా చూసే విషయంలోనూ ఒత్తిడి తేలేకపోతున్నారు. ఓ వైపు అప్పుల భారం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోంది. మరో ఇరవై, ముఫ్పై ఏళ్ల వరకూ కట్టుకునేలా ఇప్పుడు అప్పులు చేశారు. ఆదాయం పెంచే మార్గాలు కూడా లేవు. ఈ కారణంగా ఆదాయం పెరగదు కానీ కట్టాల్సిన అప్పులు మాత్రం కట్టుదాటిపోతాయి. వైసీపీతో స్నేహం కోసం బీజేపీ… రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.