చాలా కాలం నుంచి హిట్టు కోసం పరితపిస్తున్నాడు శ్రీనువైట్ల. గోపీచంద్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు వీరిద్దరూ జట్టు కట్టబోతున్నారు. `అమర్ అక్బర్ ఆంటోనీ` తరవాత ఓ స్క్రిప్టు ఓకే చేయించుకొని, హీరోని పట్టుకోవడానికి తంటాలు పడుతున్నాడు శ్రీనువైట్ల. ఎట్టకేలకు గోపీచంద్ ఈ కథకు ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. బివిఎస్ రవి ఈ చిత్రానికి కథ అందించాడని సమాచారం. బీబీఎస్ రవికీ… గోపీచంద్ కీ మధ్య ఓ చేదు జ్ఞాపకం ఉంది. అదే ‘వాంటెడ్’. రచయిత రవి.. దర్శకుడిగా మారి మెగా ఫోన్‌పట్టింది ‘వాంటెడ్’ సినిమాతోనే. అది ఫ్లాప్ అయ్యింది.
గోపీచంద్ కోసం శ్రీనువైట్ల, బివిఎస్ రవి ఇద్దరూ కలిసి యాక్షన్ థ్రిల్లర్ కథని రెడీ చేశారని తెలుస్తోంది. శ్రీనువైట్ల బలం కామెడీ. తన సినిమా ఫ్లాప్ అయినా ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంటుంది. లాజిక్కులు వెదుక్కోకుండా హాయిగా చూసుకొని నవ్వుకోవొచ్చు. అయితే.. ఎందుకనో.. శ్రీనువైట్లకు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మొహం మొత్తేసినట్టు కనిపిస్తోంది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా సీరియస్‌గా సాగే కథే. అందులోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. అదసలు శ్రీనువైట్ల మార్క్ సినిమానే కాదు. అందుకనే బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయ్యింది. శ్రీను మళ్లీ పాత స్కూలులోకి వెళ్లి సినిమాలు తీయాలని అనుకొంటున్న సమయంలో.. యాక్షన్ థ్రిల్లర్‌ని ఎంచుకొన్నాడెందుకో మరి..?!