చిరంజీవి – నాగార్జున సినిమాలు రెండూ ఒకే రోజు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. అక్టోబరు 5న గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతోంది. అదే రోజున నాగ్ ఘోస్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఘోస్ట్ రిజల్ట్ నాగార్జునకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈమధ్య నాగ్ సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతూనే ఉన్నాయి. వాటికి సరైన ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో `ది ఘోస్ట్` రిజల్ట్ నాగ్ కెరీర్ తీరు తెన్నుల్ని నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే… అదే సమయంలో నాగార్జున `గాడ్ ఫాదర్` రిజల్ట్ పైనా దృష్టి పెట్టాడు. చిరు సినిమా ఫలితం ఎలా ఉంటుందా? అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకుడు. గత కొన్ని రోజులుగా మోహన్ రాజా నాగ్ కోసం కథ పట్టుకొని తిరుగుతున్నాడు. నాగ్ ఈ కథని ఓకే చేయాలా? లేదా అనే సందిగ్థంలో ఉన్నాడు. గాడ్ ఫాదర్ గనుక సూపర్ హిట్ అయిపోతే.. నాగ్ `నో` చెప్పడానికి కారణాలేం కనిపించవు. పైగా నాగ్ తో తీసే సినిమాకి మరింత బజ్ వస్తుంది. అందుకే `గాడ్ ఫాదర్` రిజల్ట్ ఏమవుతుందా? అనే ఎదురు చూపుల్లో పడిపోయాడు. నాగ్ వందో సినిమా మైలు రాయికి అత్యంత సమీపంలో ఉన్నాడు. గాడ్ ఫాదర్ హిట్టయితే, వందో సినిమా బాధ్యతని మోహన్ రాజాపై పెట్టాలన్నది నాగ్ ఆలోచన.