మునుగోడు ఉపఎన్నికకు పదిహేను రోజుల్లో షెడ్యూల్ వస్తుందని బీజేపీకి చెందిన తెలంగాణ ఇంచార్జ్ సునీల్ భన్సల్ ప్రకటించారు. దీంతో అందరూ అదే నిజమనుకున్నారు. ఈసీని కూడా బీజేపీ మేనేజ్ చేస్తుందని కేటీఆర్ లాంటి నేతలు విమర్శలు గుప్పించారు. అయితే అది తప్పని నిరూపించడానికన్నట్లుగా హఠాత్తుగా మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించారు. ఒక్క మునుగోడు కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6 న కౌంటింగ్ ఉండనుంది. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు.
మునుగోడుకు ఉపఎన్నిక తెచ్చే వ్యూహంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఆ ప్రకారం ఇప్పుడు బీజేపీ పక్కా వ్యూహం ప్రకారమే షెడ్యూల్ విడుదల చేసింది. ఎక్కువ సమయం ఇవ్వకుండానే నెల రోజుల్లోనే పోలింగ్ ఉండనుంది. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చక్కబెట్టాల్సిన పనులు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్ జోడోయాత్రలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలుజాతీయ పార్టీ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ సమయమే ఉపఎన్నికల నిర్వహణకు కరెక్ట్ అని బీజేపీ డిసైడయినట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక కీలకం కానుంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితమే.. తెలంగాణ రాజకీయ పరిణామాల్ని మార్చనున్నాయి. బీజేపీ గెలిస్తే ఆ పార్టీలో చేరికలు ఊపందుకుంటాయి. మూడో స్థానానికి పరిమితం అయితే.. కాంగ్రెస్ .. టీఆర్ఎస్కు ప్రత్యర్థిగా మారుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీనే హాట్ ఫేవరేట్ అవుతుంది. మొత్తంగా నెల రోజుల పాటు మునుగోడు యుద్ధం హోరెత్తనుంది.