కొత్త జాతీయపార్టీ అంటూ హంగామా చేస్తున్నారు కానీ కేసీఆర్ కొత్త పార్టీ కాదని.. పార్టీ పేరు మాత్రమే మారుస్తున్నామన్న సంకేతాలను అందరికీ పంపుతున్నారు. దసరా రోజున చేయబోయే తీర్మానంలో కొత్త పార్టీ అనే ప్రస్తావన ఎక్కడా ఉండదు. తెలంగాణ రాష్ట్ర సమితిని .. భారత రాష్ట్రసమితిగా మారుస్తున్నట్లుగా తీర్మానం చేస్తారు. అంటే.. కొత్త పార్టీలో టీఆర్ఎస్ విలీనం.. లేకపోతే ప్రత్యేక పార్టీగా ఉండటం వంటి సమస్యలు రావు.
5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్లో టీఆర్ఎస్ పేరు మార్చుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను ఆహ్వానించారు. మొత్తం 283 మంది టీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం పార్టీ పేరును మార్చుతూ తీర్మానం చేయనున్నారు. ప్రత్యేకంగా పార్టీ పెట్టడం కాదని పేరు మాత్రమే మారుస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితికే కేసీఆర్ ఫిక్స్ అయ్యారు.
దసరా రోజు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండాను మీడియాకు వెల్లడిస్తారు కేసీఆర్. సమావేశంలో చేసిన తీర్మానం ప్రతులతో ఈ నెల 6న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లి సీఈసీకి వాటిని అందజేస్తారు. పార్టీ పేరు మారేదాకా వినోద్ నేతృత్వంలోని టీం ఫాలో అప్ చేస్తుంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు. పార్టీ పేరు మారి, కేంద్ర ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యాక టీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు.