సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఫిర్యాదు వచ్చిందని కేసు నమోదు చేశామని టార్గెటెడ్ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాతే మీడీయాకు సమాచారం ఇచ్చే సీఐడీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. చింతకాయల విజయ్ కు నోటీసులు ఇవ్వడానికి కాదని.. కేసు నమోదుకు ముందు రెండు రోజుల పాటు ఆయన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారన్న విషయం వెల్లడయింది. ఒకటో తేదీన కేసు నమోదు చేసినట్లుగాసీఐడీ చెప్పింది. కానీ అంతకు రెండు రోజుల ముందే సీఐడీ బృందం బంజారాహిల్స్‌లో రెక్కీ నిర్వహించింది. ఈ దృశ్యాలను టీడీపీ నేతలు సేకరించారు. మూడు కార్లలో పదిహేను మంది వరకూ వచ్చారు. అందులో ఒక కారుకు ద్విచక్ర వాహన నెంబర్ ఉంది.
అంటే కేసు నమోదుకు ముందే వారు పక్కా ప్రణాళికతో విజయ్‌ను అపహరించడానికి వచ్చారన్నమాట. అలా ఎలా వస్తారన్నది పక్కన పెడితే.. అసలు ఎవరు ఫిర్యాదు చేశారు..? ఎలా కేసు పెట్టారన్నది కూడా స్పష్టత లేదు. సీఐడీ అనేది ఓ విభాగం. ఏదైనా సమస్యపై బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లలోనే ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదులు పోలీసు శాఖ పరిష్కరించలేనిది.. రాష్ట్ర వ్యాప్త పరిధి ఉన్నది అయితే.. ఉన్నతాధికారులు సమీక్షించి సీఐడీకి ఇస్తారు. అంటే సంచలనాత్మక కేసులు మాత్రమే సీఐడీకి వెళ్తాయి.
కానీ ఇక్కడ సీఐడీ నేరుగా కేసులు నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం లేదు. కోర్టు కూడా ఆదేశించడం లేదు. కోర్టు ఆదేశించిన కేసుల్ని లైట్ తీసుకుంటోంది. ఇలా ఎవరో ఫిర్యాదు చేయడం.. చేస్తారని ఊహించడం.. ముందుగానే టార్గెట్ చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం వంటివి తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. పోలీసులు ప్రైవేటు సైన్యంలా మారితే… ఇలాంటి కిడ్నాపులే ఉంటాయి. తప్పుడు ఫిర్యాదు.. తప్పుడు కేసులు… కేసులు పెట్టక ముందే రెక్కీలు…పోలీసులు ఇలా కూడా చేస్తారా అని ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి. కానీ ప్రస్తుతం ఏపీలో చట్టం.. రాజ్యాంగం ఏవీ లెక్కలోకి రావడం లేదు. వ్యవస్థ మళ్లీ గాడిలో పడినప్పుడే ఈ తప్పులన్నీ ఎవరు..ఎందు కోసం చేశారన్న విషయం వెలుగులోకి వస్తుంది.