‘గాడ్ ఫాదర్’ సినిమా ఈ దసరాకి వస్తోంది. ఇందులో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ట్రైలర్లో సల్మాన్ ఎంట్రీ హైలెట్ అయ్యింది. చిరంజీవికి బాడీ గార్డ్ గా, ఆయన్ని ప్రొటెక్ట్ చేసే పాత్ర అది. థియేటర్లో గూజ్బమ్స్ ఇచ్చే మూమెంట్ అది. అయితే… ఈ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపిస్తే ఇంకా అదిరిపోయేది అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. చిరుని ప్రొటెక్ట్ చేసే పాత్రలో పవన్ ఉంటే ఇంకెంత బాగుండేదో..? కాకపోతే.. ఇక్కడ దర్శకుడు మోహన్ రాజా దగ్గర ఓ లాజిక్ కూడా ఉంది.
సల్మాన్ పాత్రలో మెగా హీరోల్ని ఎందుకు తీసుకోలేదు.. ? అని అడిగితే ఆయన ఓ లాజిక్ చెప్పారు. ”గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి గొప్పగా చెప్పే ఓ స్టార్ మాకు కావాలి. మెగా ఇంట్లో చాలామంది స్టార్లు ఉండొచ్చు. వాళ్లు చిరంజీవి గురించి ఎంత పాజిటీవ్ గా మాట్లాడినా అంత కిక్ ఉండదు. అదే బయట నుంచి వచ్చిన వేరే స్టార్ మాట్లాడితే.. ఆ హైప్ వేరేలా ఉంటుంది. ‘అసలు బ్రహ్మ (గాడ్ ఫాదర్లో చిరంజీవి పాత్ర పేరు) ఎలాంటి వాడో తెలుసా? అని బిల్డప్ ఇచ్చే డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగ్ లో.. బ్రహ్మ ఎలాంటివాడో విజువల్ గా చూపించలేం. కేవలం మాటే ప్రేక్షకులకు చేరాలి. అలా చేరాలంటే ఓ స్టార్ కావల్సివచ్చింది. అందుకే సల్మాన్‌ని తీసుకొన్నాం” అన్నారు.
సల్మాన్‌నే ఎందుకు? అని అడిగితే ఆయన దగ్గర మరో లాజిక్ కూడా ఉంది. ”చిరంజీవికి అత్యంత సన్నిహితులైన స్టార్ హీరోల పేర్లు వెదుకుతుంటే.. సల్మాన్ పేరు కనిపించింది. సల్మాన్ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా చిరంజీవి గారి ఇంట్లోనే బస చేస్తారు. చరణ్‌తో సల్మాన్ చాలా క్లోజ్‌గా ఉంటాడు. అందుకే.. సల్మాన్ పేరు తీసుకొచ్చా. నేను నా ఆలోచన చెప్పగానే.. చిరంజీవిగారు సల్మాన్‌కి ఫోన్ చేయడం, సల్మాన్ ఒప్పుకోవడం కేవలం 20 నిమిషాల్లో జరిగిపోయాయి. సల్మాన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడన్న విషయం చిరంజీవిగారు కూడా నమ్మలేదు. అందుకే మళ్లీ సల్మాన్ కి ఫోన్ చేశారు. ‘ఇందులో నువ్వు నిజంగానే నటిస్తున్నావా’ అని అడిగారు. దాంతో సల్మాన్‌కి కొత్త అనుమానం వచ్చింది. `ఇన్నిసార్లు అడుగుతున్నారంటే నాకో డౌట్ వస్తోంది. ఇందులో నెగిటీవ్ పాత్ర ఏమీ కాదు కదా` అని అడిగారు. చిరంజీవి గారు ‘లేదు. పాజిటీవ్ పాత్రే’ అన్నారు. ‘అయితే ఇన్నిసార్లు ఫోన్ ఎందుకు చేయడం.. నేను ఈ సినిమా చేస్తున్నా అంతే’ అని మాటిచ్చేశారు.. అలా.. సల్మాన్ ఈసినిమాలోకి ఎంట్రీ ఇచ్చార”ని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా.