తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ పేరు చెప్పినా.. టీఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. దేశంలో మరే అంశానికీ ప్రాధాన్యం లేదు.. తమ లక్ష్యం తెలంగాణ అని టీఆర్ఎస్ను స్థాపించారు. సెంటిమెంట్‌ను రగిలిగించారు. ప్రజలందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. రెండు సార్లు అదే సెంటిమెంట్‌తో అధికారాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా తెలంగాణను మర్చిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏ ఉద్యమం.. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణను మార్చేయాలని డిసైడ్ అయ్యారు. తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని చరిత్రలో కలిపేస్తున్నారు.
తెలంగాణ ప్రజల పార్టీని లేకుండా చేస్తున్న కేసీఆర్
కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నారంటే.. అది తెలంగాణ ప్రజలకు దూరమైనట్లే. ఇప్పటి వరకూ జాతీయ పార్టీలన్నీ దండగా.., తెలంగాణ మన ఇంటి పార్టీ.,. వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యే వారు. మన పార్టీ అనే భావన.. సెంటిమెంట్ టీఆర్ఎస్కు రక్షణ కవచంగా ఉండేది. ఉద్యమ సమయంలో ఇతర పార్టీలన్నింటీనీ వేరే ప్రాంత పార్టీలు అన్న ముద్ర వేయడంతో మన పార్టీ అనే భావన పెరిగింది. ఇప్పుడు మన పార్టీని కేసీఆర్ అంతర్థానం చేస్తున్నారు.
కేసీఆర్ చేసిన ప్రాంతీయ ఉద్యమాలకు.. పెట్టే జాతీయ పార్టీకి మధ్య పొంతన ఉంటుందా ?
కేసీఆర్ అంటే ప్రాంతీయ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఆయన తమ ప్రాంతం కోసం పోరాడారని అనుకుంటారు. ఆయనను జాతీయ నాయకుడిగా చూసే ముందు తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడారని గుర్తు పెట్టుకుంటారు. అలాంటి రాజకీయ నేత ఇప్పుడు దేశ మొత్తానికి మెరుగైన రాజకీయం చేస్తానని బయలుదేరితే ఎవరైనా నమ్ముతారు. కేసీఆర్ చేసిన ప్రాంతీయ ఉద్యమాలకు.. ఆయన చెబుతున్న దేశ రాజకీయాలకు పొంతన ఉండదు. అసలు కుదరనే కుదరదు. ప్రజల్లో నమ్మకం లేదు. ఇతర రాష్ట్రాల ప్రజల సంగతేమో కానీ.. కేసీఆర్ తెలంగాణనూ వదిలేశారని అక్కడి ప్రజలు నమ్మితే పునాదులు కదిలిపోతాయి.
ఆర్థిక బలంతో ఏదైనా చేయవచ్చని కేసీఆర్ అనుకుంటున్నారా ?
కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు కానీ.. మరో విధంగా ఆయనతో కలిసి రాజకీయాలు చేసేందుకు కానీ దేశంలో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి పిలిచారన్న కారణంతో కొంత మంది నేతలు వచ్చి మొహమాటంతో ప్రెస్ నోట్లు విడుదల చేసి వెళ్లారు కానీ వారూ కేసీఆర్ రాజకీయంలో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీ పెట్టక ముందు కొంత మంది కలిశారు కానీ ఇప్పుడు ఇంకెవరూ కలిసే అవకాశం ఉండదు. చాన్స్ కూడా ఇవ్వరు. అయితే కేసీఆర్ అపరిమితమైన ధనబలంతో రాజకీయాలు చేయవచ్చని గట్టి నమ్మకంతో ఉన్నారు. అది ఎంత వరకూ సాధ్యమో.. ముందు ముందు తేలుతుంది. అయితే మూలాలు మరిచిన వారికి ఎప్పుడూ విజయాలు లభించవని పెద్దలు చెబుతూంటారు. ఆ ప్రకారం తెలంగాణను మరిచి కేసీఆర్ సాధించేది ఏముంటుందనేది ఎక్కువ మంది భావన !