అమరావతి విషయంలో హైకోర్టు చెప్పింది. కానీ పట్టించుకోవడం లేదు. కోర్టు ధిక్కరణ అవుతుందనే భయం లేదు. కోర్టునైనా ధిక్కరిస్తామంటున్నారు. ఇది ఒక్కటి కాదు. కొన్ని వందల కేసుల్లో కోర్టును ధిక్కరించారు. కోర్టు చేత చీవాట్లు తిన్నారు. సివిల్ సర్వీస్ అధికారుల్ని జైలుకు పంపినంత పని చేశారు. కానీ ఇప్పుడు మాత్రం విశాఖలోని దసపల్లా భూములను రాత్రికి రాత్రి ప్రైవేటుకు కట్టబెట్టేయడానికి కోర్టు ధిక్కరణ భయం అని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే తాము ప్రైవేటు వ్యక్తులకు భూములు ఇచ్చేస్తున్నామని… అలా ఇచ్చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అంటున్నారు.
విశాఖలో దసపల్లా భూముల స్కాం మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరిగిందని రూ. వేల కోట్లు దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భూములన్నీ ప్రభుత్వానివని.. అందుకే గత ప్రభుత్వం 22ఏలో చేర్చిందని..కానీ ఈ ప్రభుత్వం న్యాయపరంగా ఎలాంటి పోరాటం చేయకుండా… సుప్రీంకోర్టు తీర్పు పేరుతో ప్రైవేటుకు భూములు అప్పగించేస్తున్నారని అంటున్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అంటున్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీ హయాంలో ఆ భూముల్లో లావాదేవీలు జరగకుండా 22ఏలో చేర్చి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కానీ అప్పట్లో వైసీపీ నేతలు దసపల్లా భూములను టీడీపీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ లెక్కన ఇప్పుడు వారు కొట్టేస్తున్నారని అనుకోవాలి.
దసపల్లా భాముల విషయంలో వైసీపీ నేతల తీరు చూస్తూంటే… కోర్టు తీర్పులను కూడా తమకు అనుకూలమైన వాటిని అమలు చేసి.. వ్యతిరేకమైన వాటిని అమలు చేయం .. ఏం చేస్తారో చేసుకోండని అన్నట్లుగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎన్నో కేసుల్లో కోర్టు తీర్పులను అమలు చేయకుండా ధిక్కారనికి పాల్పడుతూ..వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అయినా దసపల్లా భూములను సుప్రీంకోర్టు తీర్పు..కోర్టు ధిక్కరణ భయంతో అమలు చేస్తున్నామని చెప్పడం.. ప్రజల్ని మోసం చేయడమే. ప్రజా ఆస్తుల్ని అప్పనంగా కొట్టేయాలనుకోవడమే.