కేసీఆర్ జాతీయ పార్టీలో ఏపీలోనూ రాజకీయ నేతలు చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం వేరు.. ఏపీలో విస్తరించడం వేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచింది ఆంధ్ర ద్వేషం మీద. ఆంధ్రుల్ని దూషించడం ద్వారా. అదే సమయంలో ఇప్పటికీ తెలంగాణతో ఏపీకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నీటి దగ్గర్నుంచి కరెంట్ బకాయిల వరకూ ఈ సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి వివాదాలు పెట్టుకుని అదీకూడా టీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలంగాఉన్న సమయంలో ఏపీ నుంచి ఎవరైనా.. కేసీఆర్‌తో కలుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఏపీ రాజకీయ నేతలకు అసలు రాష్ట్ర ప్రయోజనాలతో పనే్ లేదు.
ఖచ్చితంగా ఏపీలో అడుగు పెడతామని కేసీఆర్ చాలా రోజులుగా చెబుతున్నారు. ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తమను చాలా మంది పిలుస్తున్నారన్నరు. అప్పుడేదో ఆషామాషీ అని కొంత మంది అనుకున్నారు. కానీ కేసీఆర్ జాతీయ పార్టీపై స్పష్టతతో ఉన్నారని.. అందుకే తాము ఏపీలోకి వస్తామని చెప్పారని ఇప్పుడు క్లారిటీ వస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలు చేసినప్పటి నుండే ఏపీలో ప్రభుత్వ పరిపాలనపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో పాలన దారుణంగా ఉందని ఇటీవల టీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే అంటున్నారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్లాన్ ప్రకారమే.. కేసీఆర్ తన భారత రాష్ట్ర సమతిని ఏపీలో విస్తరించాలనుకుంటున్నారని చెబుతున్నారు.
గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి మారీ సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏపీ అధ్యక్షుడు అయనే అన్న చర్చ జరిగింది. కానీ ఉండవల్లి మాత్రం ఆ చర్చ పెరగకుండా వెంటనే ఖండించారు. ఏపీ ప్రజలు అంటేనే కులం అంటే పడి చస్తారని టీఆర్ఎస్ నేతలు తరచూ చెబుతూంటారు. ఈ ప్రకారం కేసీఆర్ కులం అయిన వెలమ.. కొప్పుల వెలమ వంటి కులాల్ని ఓటు బ్యాంక్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా కేసీఆర్ జాతీయ పార్టీ .. ఏపీలోని రాజకీయ నేతలు ఎంత స్వార్థ పరులో మరోసారి సాక్ష్యాలతో సహా బయటపెట్టనుంది.