GodFather Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
నాగార్జున కెరీర్లో ‘శివ’ ఓ మైలురాయి. తెలుగులోనే కాదు.. భారతీయ సినీ పరిశ్రమలన్నీ కూడా దాన్నొక ట్రెండ్ సెట్టర్‌గా పరిగణిస్తుంటాయి. అలాంటి సినిమాతో పోలుస్తూ `ది ఘోస్ట్`ని ప్రచారం చేశారు కథానాయకుడు నాగార్జున. ప్రచార చిత్రాలు, నాగార్జున స్టైలిష్ లుక్ కూడా అంచనాల్ని పెంచింది. `గరుడవేగ` వంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ని తీసి మెప్పించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మరి సినిమా అందుకు తగ్గట్టుగా ఉందా? నాగార్జున పోల్చినట్టుగా `శివ`తో `ది ఘోస్ట్`కి ఎంత సారూప్యం ఉంది? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథలోకి వెళదాం…
విక్రమ్ (నాగార్జున), ప్రియ దుబాయ్‌లో పనిచేసే ఇంటర్ పోల్ అధికారులు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరూ కలిసి ఆపరేషన్స్ చేస్తుంటారు. విజయవంతమైన ఓ ఆపరేషన్ తర్వాత, భారతీయ కుటుంబానికి చెందిన ఓ బాబు కిడ్నాప్ అవుతాడు. ఆ అబ్బాయిని కాపాడేందుకు ఇద్దరూ రంగంలోకి దిగుతారు. అణచుకోలేని కోపం, ఎప్పుడూ వెంటాడే గతంతో దూకుడుగా వ్యవహరిస్తుంటాడు విక్రమ్. అబ్బాయిని కాపాడే క్రమంలో ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోతాడు. దాంతో విక్రమ్ మానసికంగా సతమతమవుతాడు. ప్రియకి కూడా దూరమవుతాడు. ఇంటర్‌పోల్ నుంచి బయటికొచ్చి ఫ్రీలాన్స్ పనులు చేస్తున్న విక్రమ్‌కి అను (గుల్‌పనాగ్) నుంచి ఫోన్ వస్తుంది. ఇరవయ్యేళ్ల తర్వాత విన్న గొంతు అది. ఆపదలో ఉన్నాననీ, తననీ తన కూతురు అదితి (అనైకా సురేంద్రన్)ని కాపాడమని కోరుతుంది. నాయర్ గ్రూప్ బాధ్యతలు చూస్తున్న అను గతమేమిటి? ఆమెకీ, విక్రమ్‌కీ సంబంధమేమిటి? అనుకి ఉన్న వైరం ఎవరితో? విక్రమ్ వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగతా కథ.
ఒక మంచి స్టైలిష్ యాక్షన్ సినిమా చేయమని ప్రవీణ్ సత్తారుని నేనే అడిగాననీ… నన్నుదృష్టిలో ఉంచుకునే ఆయన కథ రాసి ఈ సినిమా చేశాడని నాగార్జున స్వయంగా వెల్లడించారు. దీన్నిబట్టి ఇది యాక్షన్ నుంచి పుట్టిన కథ అనే విషయం స్పష్టం అవుతుంది. మామూలుగా ఓ కథలో యాక్షన్‌ని చూస్తుంటాం. ఈ సినిమా చూస్తే యాక్షన్ ఘట్టాల మధ్య ఓ కథని ఇరికించినట్టు ఉంటుంది. అసలు కథగా కూడా చెప్పే ప్రయత్నం ఎక్కడా కనిపించదు. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం పేర్చినట్టే అనిపిస్తుంది. దాంతో కథ ఎమోషనల్‌గా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. కట్ చేస్తే ఫైట్, పాట అన్నట్టే ఉంటాయి ప్రారంభ సన్నివేశాలు. అను నుంచి ఫోన్ వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. కథానాయకుడి బాల్యం, ఏ పరిస్థితుల్లో అతను కుటుంబానికి దూరమయ్యాడో ఆ సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. అను కూతురు అదితిని క్రమశిక్షణతో దారిలో పెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ నేపథ్యంలో భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉన్నప్పటికీ అది జరగలేదు. సెకండ్‌హాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు కూడా మెప్పిస్తాయి. కానీ వీటన్నిటినీ పక్కాగా కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. యాక్షన్ సన్నివేశాలు ప్రతిదీ కొత్తగా ఉందా? అంటే అది కూడా లేదు. విరామం తర్వాత అడవిలో సాగే పోరాట ఘట్టాలు ఏ దశలోనూ మెప్పించకపోగా, సుదీర్ఘంగా సాగుతాయి. ఘోస్ట్ అంటూ మరోసారి హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని చూపిస్తారు. అందులో ఎలివేషన్స్ ఓకే కానీ, అంతకుమించి కొత్తదనం ఏమీ కనిపించదు. కార్పొరేట్ డ్రామా ఒకింత కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టు అనిపిస్తుంది. `ఖైదీ, `విక్రమ్` తరహా గన్ ఫైట్‌తో పతాక సన్నివేశాలు సాగుతాయి.
నాగార్జున, సోనాల్ చౌహాన్ జోడీ స్టైలిష్ అవతారంతో మెప్పిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌ల్లో ఆ ఇద్దరి కష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా నాగార్జున సన్నివేశాల్లో సహజంగా కనిపించే ప్రయత్నం చేశారు. గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన సోనాల్‌కి ఇందులో నటించే అవకాశం దక్కింది. గుల్‌పనాగ్, అనైఖా పాత్రలకి ప్రాధాన్యం దక్కింది. అయితే ఆయా నటులు తెలుగు తెరకు కొత్త. దాంతో నేటివిటీ మిస్ అయ్యింది. సాంకేతిక విభాగంలో ముఖేష్ కెమెరాకి ఎక్కువ మార్కులు పడతాయి. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం బాగుంది. రెండు పాటలు ఆకట్టుకుంటాయి. మేకింగ్ రిచ్‌గా ఉంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రచనలో చాలా లోపాలు కనిపిస్తాయి.
సినిమాలో కథ బాగుంటే అన్నీ బాగున్నట్టే. కథనే పక్కనపెట్టి ఇతరత్రా విషయాల కోసం ఎంత హంగామా చేసినా వృథానే. ఆరు పాటలు, ఆరు ఫైట్ల ఫార్ములా జమానాని గుర్తు చేస్తున్నట్టుగా ఉందీ సినిమా. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, అక్కడక్కడా థ్రిల్స్ కోసం మినహా కొత్తదనం లేని సినిమా ఇది. నాగార్జున అభిమానుల్ని మాత్రం ఆయన స్టైలిష్ అవతారం మెప్పిస్తుంది.
ఫినిషింగ్ టచ్ : రోస్ట్
తెలుగు360 రేటింగ్: 2.25/5