ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మానసిక స్థితిపై విపక్షాలు చాలా రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు ఆయన చేసే ప్రకటనల వల్ల ప్రజల్లోనూ దీనిపై అనుమానాలు వస్తూ ఉంటాయి. తాజాగా కాకినాడలో ఓ అమ్మాయిని పట్టపగలు ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు. ఈ కేసు పూర్వాపరాల సంగతి పక్కన పెడితే.. సీఎం జగన్ దీనిపై స్పందించారు. దిశ చట్టం ప్రకారం వెంటనే నిందితుడ్ని శిక్షించాలని ఆదేశించారు. సీఎం నుంచి వచ్చిన ఈ ప్రకటనను చూసి చాలా మంది ఉఫ్ అని నిట్టూర్చారు.. ఎందుకంటే దిశ చట్టం అనేది లేదు.
దిశ అనే చట్టాన్ని తాను అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలతో ఆమోదించామని అది చట్టం అయిపోయినట్లేనన్న ఓ హలోకేషన్లో సీఎం జగన్ ఉన్నారు. అది చట్టం కాలేదని ఆయనకు చెప్పే ధైర్యం ఎవరికీ లేదో.. లేకపోతే ఆయన తెలుసుకునేందుకు సిద్ధంగా లేరో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పటికీ దిశ కోసం ఆమోదించిన బిల్లుకేంద్రం దగ్గరే ఉంది. కేంద్రం ఆమోదించలేదు. అంటే ఆ చట్టం ఉనికిలోకి రానట్లే. ఆ చట్టం ఉనికిలోకి రాకుండా వాటి కింద కేసులు పెట్టడం అసాధ్యం. ఈ మాత్రం మన ముఖ్యమంత్రికి తెలియదనుకోలేం. కానీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ?
ముఖ్యమంత్రి దిశ చట్టం ఉందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇతరులూ నమ్ముతున్నారు. ఆయన దగ్గర పని చేసిన మాజీ హోం మంత్రి ఏకంగా ముగ్గురికి ఉరి శిక్షలు వేసేశామన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ఏపీలో పాలన అంటే ఇంత కామెడీ అయిపోయింది. లేని చట్టాలతో శిక్షలు వేయమంటారు… ఉన్న చట్టాలను పట్టించుకోరు.. పోలీసులు నేరాల్లో భాగమవుతూంటారు.. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఇంత అస్తవ్యస్థ పాలనను ఏపీ గతంలో ఎప్పుడూ చూసి ఉండదు.