నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు“గాడ్ ఫాదర్ లో చిరంజీవి చెప్పిన సూపర్ డూపర్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ బాగా పేలింది. దానికి కారణం.. చిరు రాజకీయ జీవితానికి ఈ డైలాగ్ చాలా దగ్గరగా ఉండడమే. చిరు రాజకీయాల నుంచి దూరమై చాలా కాలమైంది. అయితే.. రాజకీయ నాయకులు, పార్టీలు, ఆయన అభిమానులు, నిర్మాతలు, దర్శకులు మాత్రం ఆయన్ని పొలిటికల్ వింగ్లోకి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో కూడా ఇదే జరిగింది.
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఇటీవల విడుదలై.. మంచి విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు ప్రజారాజ్యంకి సంబంధించి కొన్ని కీలమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పార్టీని నడపలేక చిరు.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దాంతో.. పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి. చిరు తన పార్టీని అమ్ముకొన్నాడన్నారు. అయితే.. చిరు పార్టీని విలీనం చేసే సమయానికి ప్రజారాజ్యం అప్పుల్లో ఉంటే, ఆ అప్పుల్ని తీర్చడానికి చెన్నైలోని తన పేరుమీద ఉన్న విలువైన ఆస్తిని చిరు అమ్ముకోవాల్సివచ్చిందట. ఈ విషయం ఇప్పుడు ప్రస్తావించడం అసందర్భమే. కేవలం చిరు మంచితనాన్ని, నిజాయతీని గుర్తు చేయడానికి ఎన్వీ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.
కాకపోతే.. ప్రజారాజ్యంలోని కోపం, ఆవేశం నుంచి జనసేన పుట్టిందని చెప్పడం చిరుని ఇంకా ఇంకా రాజకీయాల్లోకి లాగడమే. ప్రజారాజ్యానికి ఉప పార్టీగా జనసేన పై ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించవచ్చు. చిరు నోటి నుంచి ఈమధ్య రాజకీయాలకు సంబంధించిన మాటలేం రావడం లేదు. కాకపోతే.. ఆయన చుట్టు పక్కల ఉన్నవాళ్లే కావాలని ఆయన్ని మళ్లీ పొలిటికల్ రింగ్ లోకి దింపుతున్నారు. ఇంకొన్నాళ్లు ప్రజారాజ్యం గురించీ, పార్టీని అమ్ముకోవడం గురించీ, జనసేన కూడా ప్రజారాజ్యం కొమ్మే అని చెప్పుకోవడానికి.. ఎన్వీ ప్రసాద్ తన వంతుగా కొంత ఉప్పు అందించినట్టైంది.