మునుగోడులో డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేసేస్తున్నారు. పది ఓట్లు వస్తాయంటే పది లక్షలు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖర్చులో వెనుకబడింది. కానీ అధికార పార్టీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక వనరులకు లోటు లేదు. మునుగోడులో బీజేపీకి బలం లేకపోవడంతో పూర్తిగా ఆయన డబ్బునే నమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసి మరీ పార్టీ కండువాలు కప్పుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వారి వారి స్థాయిని బట్టి రూ. పది లక్షలు కన్నా ఎక్కువగానే ముట్టచెబుతున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆఖరు క్షణంలో నియమితులైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరికలపై గతంలోనూ దృష్టి పెట్టారు. మంత్రి జగదీష్ రెడ్డి పలువురు నేతలకు కండువాలు కప్పారు. రాష్ట్రంలో అధికార పార్టీ కావడంతో వారికి కూడా బాగానే గిట్టుబాటు అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేతలకు పంచుతున్నారు.. ఓటింగ్ సమయంలో ఓటర్లకు పంచుతారు. ఇది ఓటుకు పదివేల వరకూ ఉన్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఖర్చు విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వెనుకబడి ఉన్నారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మునుగోడులో చేస్తున్న ఖర్చు పూర్తిగా అనధికారికం. సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఖర్చు చేయాల్సిన మొత్తం రూ. 40 లక్షలు మాత్రమే. తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడి గెలుపోటములు తర్వాత రాజకీయ పరిణామాలకు అత్యంత కీలకం కావడమే దీనికి కారణం. అందుకే రాజకీయ పార్టీలు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఎన్నికలు ముగిసిపోయే సరికి.. అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మిగిలినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.