విశాఖలో తన కుమార్తె, అల్లుడి పేరుతో చేసిన “బలవంతపు భూసేకరణ” , బినామీలతో దసపల్లా భూముల్లో సాగిస్తున్న దందాలు ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. మూడు రోజుల నుంచి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా విజయసాయిరెడ్డి స్పందించడం లేదు. తన వాదన ఏమిటో చెప్పడంలేదు. మీడియా నిజం చెబుతుందో అబద్దం చెబుతుందో మాట్లాడటం లేదు . మరో వైపు జాతీయ మీడియా కూడా విజయసాయిరెడ్డి భూ దందాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఆయన వ్యవహారాలపై కథనాలు వచ్చాయి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ …ఈ అంశంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. ప్రసిద్ధమైన ఆర్థిక నేరగాడు విజయసాయిరెడ్డి విశాఖలో దందాలు చేస్తున్నారని .. వేల ఎకరాలు కాజేశారని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా విశాఖలో విజయసాయిరెడ్డి అండ్ కో చేస్తున్న వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ నేరుగా సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ప్రతీ దానికి తగుదునమ్మా అంటూ ట్విట్టర్లో బూతులు మాట్లాడుతూ చెలరేగిపోయే విజయసాయిరెడ్డి ..బయటకు వచ్చిన తన భూదందాపై మాత్రం నోరు తెరవడం లేదు.
ఈ అంశంలో ఆయన వెర్షన్ ఏమిటో తేలిన తర్వాతే మిగిలిన విషయాలు బయటకు వస్తాయి. అయితే ఇది జాతీయ స్థాయికి వెళ్లడం.. మూడు రాజధానుల పేరుతో విశాఖలో చేస్తున్న హడావుడి వెనుక ఉన్న కోణం ఇదేనని బయటపడటంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కుమార్తె, అల్లుడి కంపెనీ పేరుతో కొన్న భూములన్నీ… ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు గురి చేసి రాయించుకున్నారన్న ఆరోపణలు కూడా బలంగానే వస్తున్నాయి.