వైసీపీ నేతలు తమ పార్టీని నమ్ముకుని ప్రజల దృష్టిలో చులకన అయిపోతున్నారు. అమరావతి విషయంలో ఎన్నికలు ముగిసే వరకూ అమరావతే రాజధాని అని కుండబద్దలు కొట్టి చెప్పిన వాళ్లు ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఇలాంటి వారిలో ధర్మాన ప్రసాదరావు అనే సీనియర్ నేత దగ్గర్నుంచి పెద్దిరెడ్డి అనే రాజకీయ కుబేరుడు వరకూ ఉన్నారు. అందరూ ఎన్నికలకు ముందు అమరావతికి భేషరతుగా మద్దతు తెలిపిన వారే. అధికారం చేతికి అందిన తర్వాత మాట మార్చిన వారే.
ఎన్నికల సమయంలో అమరావతి గురించి వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతున్నాయి. అప్పట్లో అమరావతిని కాదంటే రాష్ట్రం మొత్తం వ్యతిరేకత వస్తుందని వారికి తెలుసు కాబట్టి.. తమ తమ ప్రాంతాల్లోనూ అమరావతికే మద్దతు ఉంది కాబట్టి.. వారు అలా మాట్లాడారు. కానీ అధికారం చేతికి అందిన తరవాత విశాఖలో ఆస్తులపై కన్నేసి.. అధికారం అండతో ప్రజల్ని రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థిస్తూ .. అడ్డగోలుగా వాదిస్తూ రాష్ట్ర భవిష్యత్తో ఆడుకుంటున్న వారి వ్యవహారంపై పెద్ద మచ్చ పడిపోయింది. ప్రజల్లో చులకన ఏర్పడింది.
వైసీపీ నేతలు అంటే చెప్పిన మాట మీద నిలబడరని.. అవకాశానికి తగ్గట్లుగా మాట్లాడి ప్రజల్ని నట్టేట ముంచుతారన్న అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. ఒక్క అమరావతి విషయంలోనే కాదు అనేక విషయాల్లో ఇదే జరుగుతోంది. సన్నబియ్యం ఇస్తామని మీ అమ్మ మొగుడు చెప్పాడా అని కొడాలి నాని ఎదురుదాడికి దిగినప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ అదే పరిస్థితి మేము చెప్పలేదని అనడం.. కామన్ అయిపోయింది. వీరి తీరు చూసి..ఇలాంటి వాళ్లనా నమ్మింది అని ప్రజలు కూడా తమను తాము ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి.
ఇప్పుడు ప్రజల ముందు వైసీపీ నేతలు చులకనయ్యారు. అధికారం ఉంది కాబట్టి కొంత మంది వందిమాగధులు అహో ఓహో అనవచ్చు. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని ప్రచారం చేసుకోవచ్చు. కానీ మళ్లీ తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. ఆ విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోయారు. ప్రజల్లో తమ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. శీలం లేనిరాజకీయ నేతలుగా నిలబడిపోయారు.