మూడు రాజధానుల పేరుతో షో చేసేందుకు రెడీ అవుతున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. పదిహేనో తేదీన విశాఖలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని దానికి గర్జన అని పేరు పెట్టినట్లుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. ఈ గర్జన ప్రకటనపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. దాదాపుగా పాతిక ట్వీట్లు చేశారు. వైసీపీ పాలనా వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఇంత తీవ్రంగా స్పందించడం ఇటీవలి కాలంలో ఇదే తొలి సారి. దాదాపుగా ఇరవై ఐదు ట్వీట్లు చేశారు.
అయితే వైసీపీ గర్జనను పవన్ నేరుగా ఎదుర్కొంటారని ఎవరూ అనుకోలేదు. కానీ రంగంలో దిగాలని నిర్ణయించుకున్నారు. పదిహేనో తేదీన విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. ఆ రోజున వైసీపీ గర్జనకు పోటీగా జనసేన హంగామా చేసే అవకాశం ఉంది. పదహారో తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి మూడు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు వచ్చే అవకాశం ఉంది.
ఓ వైపు ఉత్తరాంధ్రలో విశాఖలో వైసీపీ నేతల కబ్జాల.. భూ దందాలు హెడ్ లైన్స్‌లో నిలుస్తున్నాయి. బెదిరింపులకు పాల్పడి మరీ భూముల్ని రాయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు వీటి గురించి పట్టించుకోకుండా .. విశాఖ రాజధాని సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రజా సమస్యలను హైలెట్ చేసేందుకు పవన్ కల్యాణ్ వైసీపీతో నేరుగా ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగుతున్నారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారనుంది..