ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ కాకుండా.. టీఆర్ఎస్ మొదటి బాధితురాలిగా మారుతోంది. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ పాలసీ మారిస్తే.. అందులో ఉన్న స్కాం మూలాలన్నీ తెలంగాణలోనే కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సీబీఐ, ఈడీ విచారణలో ఉంది. ఇప్పటికి మూడు అరెస్టులు చేశారు. టీఆర్ఎస్ పెద్దలకు సమీప బంధువు అయిన బోయినపల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. అయితే రాబిన్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు పలు రకాలుగా అభిషేక్ రావుతో వ్యాపారాలు చేస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను మాత్రం అరెస్ట్ చేయలేదు. దీనికి కారణం ఆయన అప్రూవర్‌గా మారిపోవడమేనని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.
అరుణ్ రామచంద్ర పిళ్లైను సీబీఐ అధికారులు పలు మార్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆధారాలన్నీ ముందు పెట్టి ప్రశ్నించడంతో ఆయన .. జరిగిన స్కాం మొత్తం చెప్పారని.. తెర వెనుక ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పారని అంటున్నారు. అప్రూవర్‌గా మారేందుకు సైతం అంగీకరించారని అందుకే ముందు కీలక పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు. పిళ్లై అప్రూవర్‌గా మారితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అవుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఈ స్కాం విషయంలో గుంభనంగా వ్యవహరిస్తోంది పెద్దగా స్పందించడం లేదు.
ఈ స్కాంలో మొదటి నుంచి కవిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డిని కూడా ఈడీ వరుసగా వారం రోజుల పాటు ప్రశ్నించింది. ఈ స్కాంలో సీబీఐకి పక్కా ఆధారాలున్నాయని.. రాజకీయ కక్ష సాధింపులు అనే ఆరోపణలు వచ్చినా తగ్గే చాన్స్ లేదని చెబుతున్నారు. కారణం ఏదైనా పిళ్లై అప్రూవర్‌గా మారారంటే టీఆర్ఎస్లో అనేక మంది గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.