తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో అడుగు పెట్టారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తనతో పాటు ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చే ప్రక్రియ తో పాటు మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అక్రమాలపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయడానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ పార్టీ వ్యవహారాలను ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేసుకునేందుకు కేసీఆర్ ఈ ఢిల్లీ పర్యటనలో ప్రయత్నిస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేని తటస్తులతో భేటీలు అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కొన్ని చిన్న పార్టీలతో పొత్తులు లేదా విలీనాలపై చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ పార్టీ ప్రకటన తర్వాత ఇంత వరకూ మీడియాతో మాట్లాడలేదు. జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలో స్థాయిలో మొదటి సారి జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్టుతో పాటు వెన్నమనేని శ్రీనివాసరావు దగ్గర దొరికిన ఆధారాలతో టీఆర్ఎస్ ముఖ్యులకు మైండ్ బ్లాంక్ అయిందని..ఈ అంశంపై లాబీయింగ్‌కు వచ్చారని టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ రావు సీబీఐ కస్టడీలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది.