గాడ్ ఫాదర్ హిట్ తో చిరులోనూ, ఆయన అభిమానుల్లోనూ జోష్ వచ్చింది. సక్సెస్ మీట్ లో చిరు మరింత యాక్టీవ్ గా కనిపించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ఫ్యాన్స్ కూడా ఊగిపోతున్నారు. ఆచార్యతో నిరుత్సాహ పడిపోయిన అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. రాబోయే సినిమాలపై కాస్త ఆశ కలిగించింది. ఇంత పాజిటీవ్ వాతావరణంలో.. ‘గరికిపాటి` ఎపిసోడ్ ఆయన్నీ, ఆయన అభిమానుల్నీ కాస్త ఇబ్బందికి గురి చేసింది.
‘గరికిపాటి’ ఎపిసోడ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రతీ మూలకూ చేరిపోయింది. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడేసుకొన్నారు. కాకపోతే.. చిరు, గరికపాటి తప్ప. చిరంజీవి దృష్టిలో పడాలన్న కుతూహలంతో కొంతమంది.. ఈ విషయాన్ని ఇంకాస్త రాద్దాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి సందర్భం కాకపోయినా ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్ లో ఛోటా, అనంత శ్రీరామ్, బాబి.. వీళ్లంతా గరికిపాటికి వ్యతిరేకంగా రెచ్చిపోయారు. ఇదంతా.. ఈ ఫంక్షన్లో చిరు మౌనంగా చూస్తూ కూర్చుండిపోయారు. ఇప్పుడు వర్మ బయల్దేరాడు. తనదైన శైలిలో ట్విట్టర్ నిండా బోలెడంత వెటకారం ధార బోస్తున్నాడు. గరికపాటిపై ఆయన విసుర్లు మామూలుగా లేవు. ఆఖరికి గరికపాటి సాధించిన ‘పద్మ’ పురస్కారాన్నీ వదల్లేదు. ఇంతోటి పండితుడికి పద్మ అవసరమా? అంటూ కౌంటర్లు వేశాడు.
ఇదంతా చిరు గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో అనుమానాలేం అక్కర్లెద్దు. ఎందుకంటే తనపై చిన్న నెగిటీవ్ వార్త వచ్చినా క్షణాల్లో చిరుకి తెలిసిపోతుంది. తన గురించి ఎవరేం మాట్లాడినా.. ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేసే నెట్ వర్క్ ఆయనకు ఉంది. అయినా సరే.. మెగాస్టార్ ఇంకా మౌనం దాల్చడం ఇంకా ఇంకా బాగోలేదు. ఎందుకంటే అయ్యిందేదో అయిపోయింది. అవతల ఉన్నది, ఆ రోజు నోరు జారింది… మహా పండితుడు. ఆయనంటే చిరుకి కూడా ఎనలేని గౌరవం ఉంది. అందుకే ”అభిమానులూ శాంతించండి.. ఆయన్నేం అనకండి” అంటే చిరు హుందాతనం ఎంత పెరిగిపోయేది? ”నేనే పట్టించుకోవడం లేదు.. మీకెందుకు” అని ఉంటే.. చిరు వ్యక్తిత్వం.. ఇంకెంత ఎదిగిపోయేది? కానీ… ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్ సాక్షిగా.. తన ముందే మైకు పట్టుకొని రెచ్చిపోతున్నా.. చిరు వారించలేదు. ఆ తరవాత.. తాను మాట్లాడుతున్నప్పుడు కూడా దానిపై స్పందించలేదు. తనపై అసహనం ప్రదర్శించిన వ్యక్తి.. రాజకీయ నాయకుడో, తన వైరి వర్గమో అయితే.. చిరు మౌనం దాల్చినా ఎవరూ శంకించరు. గరికపాటి లాంటి పండితుడు.. ఏదో ఆవేశంలోనో, చిరాకులోనో.. మాట తూలాడు. దాన్ని మర్చిపోయి, క్షమించగలిగే మెగా మనసు ఉన్నప్పుడు చిరు ఒక్క మాట అంటే బాగుండేది కదా అనేది అందరి అభిప్రాయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. చిరు ఒక్కడే ఈ ఎపిసోడ్ కి పుల్ స్టాప్ పెట్టగలడు.