రాజకీయాల్లో ఎక్కడైనా వెనకడుగు వేస్తున్నాం అనే అభిప్రాయం .. మాట ఎక్కడా రాకూడదు. వస్తే అది సెంటిమెంట్ దెబ్బతీస్తుంది. అయితే టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటామనే ప్రకటనలు ఎక్కువగా చేస్తున్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులే కాదు కేటీఆర్ కూడా అదే చెబుతున్నారు. మునుగోడుకు రూ. పద్దెనిమిది వేల కోట్ల నిధులు ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని కేటీఆర్ ప్రకటిస్తారు. ఈ చాలెంజ్‌ను ముందుగా మంత్రి జగదీష్ రెడ్డి చేశారు. ఆయన మాటల్ని కేటీఆర్ సమర్థించారు. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు మరో అడుగు ముందుకేశారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే పోటీ నుంచి వైదొలుగుతామని ప్రకటించేశారు. టీఆర్ఎస్ ముఖ్య నేతల ప్రకటనలు చూసి పార్టీ కార్యకర్తలు కూడా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. టీఆర్ఎస్ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలుచేయడం.. మునుగోడుకు రూ. పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం వంటివి ఎప్పటికీ చేయరని వారి నమ్మకం. అది నిజమే కావొచ్చు. కానీ ఇలా పోటీ నుంచి వైదొలుగుతామని చెప్పడం ఎందుకని పార్టీ నేతల గుసగసులు.
ఇది నెగెటివ్ టాక్ ప్రచారం కావడానికి కారణం అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ కేటీఆర్ మునుగోడు ఎన్నికల ఫలితం వల్లటీఆర్ఎస్కు వచ్చేది పోయేది ఏమీ లేదని చెబుతూ వస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలప్పుడూ అదే చెప్పారు. తేడా వస్తుందన్న రిపోర్టులు ఉండటం వల్లనే ఇలా చెబుతున్నారన్న అభిప్రాయానికి ఇతర పార్టీలు రావడాని ఇలాంటి వ్యాఖ్యలు కారణం అవుతున్నాయని అంటున్నారు.