ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై లక్ష్మిపార్వతి చెప్పిన మాటల్నే కాస్త అటూ ఇటూగా తన అభిప్రాయంగా చెప్పారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలంగా బయటకు కనిపించని ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. మెడికల్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయనపై ప్రజల్లో అభిమానం తగ్గదని… వైయస్సార్ పేరు పెట్టడం ద్వారా కొత్తగా పుట్టుకొచ్చే అభిమానం ఏమీ ఉండదని అది ప్రభుత్వ నిర్ణయం అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చినప్పుడు సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని సీఎం జగన్ పునః పరిశీలించాలని కోరుతూ పోస్టు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా బయటకు వచ్చి మాత్రం భిన్నంగా స్పందించారు.
అదే సమయంలో చంద్రబాబుకు ఎన్టీఆర్ పై ప్రేమ లేదని చెప్పేందుకు ఎప్పట్లాగే నోరు చేసుకున్నారు. నిజంగా చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే.. గన్నవరం విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మారినప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టి ఉండేవారన్నారు. అలాగే భారతరత్నకు ప్రతిపాదించేవారన్నారు. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేవారన్నారు. ఇవేమీ చేయలేదు కాబట్టి ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ప్రేమ లేదని మండిపడ్డారు. ఒక ఇంట్లో 2 ఎలుకలు తిరుగుతుంటే ఇల్లు తగలెట్టేయండి అని సలహా ఇచ్చే వ్యక్తే చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అనవసరంగా తిట్టిస్తున్నారని..ఆయన సొంతంగా ఎదిగాడన్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్వయంకృషితో పైకి వచ్చాడన్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్‌పైనా వంశీ రుబాబుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అనే వాడు టీడీపీ అడిగినా అడగకపోయినా ప్రతి విషయానికి స్పందిస్తాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో అమరావతి అంశానికి మద్దతు తెలియచేయడం.. అలాగే ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పుపైనా స్పందించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వల్లభనేని వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు. వాడు వీడు అంటూ రాజకీయ ప్రత్యర్తుల్ని కించపర్చడం ..వైసీపీ నేతలకు కామన్ అయిపోయింది.