పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చి మరీ షర్మిల ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలతో భేటీకి అని మీడియాకు లీక్ ఇచ్చారు. అక్కడకు వెళ్లి సీబీఐ డైరక్టర్‌కు కాళేశ్వరంపై ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. కానీ ఇప్పటికే కాళేశ్వరంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు కొత్తగా షర్మిల చేసేదేమిటని చాలా మంది అనుకున్నారు. కానీ షర్మిల ఢిల్లీ వెళ్లింది వైఎస్ వివేకా హత్యకేసులో వాంగ్మూలం ఇవ్వడానికని కొత్తగా “విషయం” బయటకు వస్తోంది. ఈ కేసులో సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో సమాచారం ఇచ్చారు. అయితే అప్పట్లో సీబీఐ అధికారులు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు తీసుకున్నారని చెబుతున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ కి సవాల్‌గా మారింది. విచారణ చేసి నిందితుల్ని అరెస్ట్ చేయడం కన్నా.. అసలు విచారణ చేయకుండా తమపై చేస్తున్న దండయాత్రను అడ్డుకోవడమే వారికి పెద్ద కష్టంగా మారింది. అయితే ఇది అధికారులపై దాడి కాదని మొత్తం సీబీఐపై దాడిగా ఉన్నతాధికారులు భావించినట్లుగా చెబుతున్నారు. అందుకే ఈ కేసు విషయాన్ని ఢిల్లీ నుంచే డీల్ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగింది. స్పష్టమైన ఆధారాలున్నాయి. షర్మిల వాంగ్మూలం కూడా నమోదు చేశారు. ఇక ముందు చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
షర్మిల హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడానికి స్పష్టమైన కారణాలేం కనిపించలేదు. ఖచ్చితంగా సీబీఐ అధికారుల నుంచి వివేకా కేసులో పిలుపు రావడంతోనే వెళ్లారని.. పనిలో పనిగా కాళేశ్వరంపై ఫిర్యాదు చేశారని అంటున్నారు. షర్మిల వివేకా హత్య కేసును రాజకీయ అంశంగా చూడనందునే.. ఈ విషయంలో ఎలాంటి సమాచారం బయటకు రానీయలేదంటున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆమె వాంగ్మూలం ఇచ్చారని.. ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం ప్రారంభించారు.