ప్రభుత్వం మారగానే తమను తాము పునీతులం చేసుకుంటూ క్రిమినల్ కేసులు కూడా ఎత్తివేస్తూ జీవోలు జారీ చేసుకున్న ప్రభుత్వానికి తల బొప్పి కట్టింది. తమంతట తామే మళ్లీ ఆ జీవోలను వెనక్కి తీసుకుంది. వీటిని ఉపసంహరింస్తున్నామని లెంపలేసుకుని మరీ హైకోర్టుకు సమాచారం ఇచ్చింది. దీంతో ఉపసంహరించిన కేసులన్నీ మళ్లీ కోర్టుల్లో విచారణకు రానున్నాయి.సీఎం అయిన కొన్నాళ్లకే తనపై దాదాపుగా పది కేసుల్ని జగన్ ఎత్తి వేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయించుకున్నారు. ఆధారాలు లేవని.. తప్పుడు కేసులు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా, ఆధారాలు లేవన్న కారణంతో ఆయా న్యాయస్థానాల్లో క్లోజర్ రిపోర్టులు దాఖలు చేశారు.
విచారణ అవసరం లేకుండానే వాటికి ముగింపు పలికారు. జగన్ జగన్ కేసులు మాత్రమే కాదు.. సామినేని ఉదయభాను , ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి వంటి వారిపై ఉన్న కేసులను కూడా ఉపసంహరిస్తూ జీవోలు జారీ చేశారు. ఈ కేసుల విషయంపై హైకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించింది.. అలాగే మరికొన్ని పిల్స్ కూడా పడ్డాయి. విచారణలో తాము తప్పు చేశామని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.
ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేయాలంటే హైకోర్టు అనుమతి తప్పని సరి గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. చివరికి సమాధానం చెప్పలేక.. జీవోలను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది.