చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో నెగిటీవ్ క్యారెక్టర్లు పోషించిన వాడే. 47 రోజులు లాంటి సినిమాల్లో.. తనలో విలనిజం చూడొచ్చు. అయితే ఆ తరవాత హీరో ఇమేజ్ రావడంతో… నెగిటీవ్ రోల్స్ వైపు వెళ్లలేదు. కాకపోతే.. ‘చిరంజీవి’ అనే సినిమాలో మాత్రం నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించాడు చిరు. ఆ సినిమా కథ బాగున్నా, చిరుని అలా చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఎందుకంటే అప్పటికే చిరుకి మాస్ ఇమేజ్ వచ్చేస్తోంది. హీరోగా కొన్ని సినిమాలు హిట్టయ్యాయి. దాంతో… ‘చిరంజీవి’ సినిమా ఫ్లాప్ అయ్యింది. నిజానికి ఈ సినిమా చేయడం చిరంజీవికి కూడా ఇష్టం లేదట. బలవంతంగా ఇరికించారట. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకొన్నారు చిరంజీవి. గాడ్ ఫాదర్ విజయవతంగా నడుస్తున్న సందర్భంగా మీడియాతో చిరంజీవి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా…నెగిటీవ్ రోల్స్ చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. తనని అలాంటి క్యారెక్టర్స్ లో జనం చూస్తారని అనుకోవడం లేదని.. నిజంగానే ప్రేక్షకులు తనలోని విలన్ ని చూడ్డానికి ఇష్టపడితే తప్పకుండా చేస్తాననని చెబుతూ.. ‘చిరంజీవి’ సినిమా ఎపిసోడ్ ని గుర్తు చేశారు.
”కన్నడలో హిట్టయిన ‘నన్నే రాజా’ అనే సినిమా నాకు చూపించారు. అందులో హీరో క్యారెక్టర్ లో కొన్ని నెగిటీవ్ షేడ్స్ ఉంటాయి. అంబరీష్ కూడా ఓ పాత్ర పోషించారు. అది గెస్ట్ రోల్ లాంటిది. ఆ పాత్రలో చేయాలని నన్ను అడిగారు. ‘ఈ పాత్ర ఎంతో సేపు లేదు కదా.. నెగిటీవ్ షేడ్స్ ఉన్నా, హీరో పాత్రే బెటరేమో..” అన్నాను. అంతే.. వెంటనే ఆ సినిమా రైట్స్ కొనేశారు. ‘నేను మాట వరసకు అన్నానయ్యా’ అన్నా ప్రొడ్యూసర్లు వినలేదు. వాళ్ల కోసం ఆ సినిమా చేశాను. కానీ నేను అనుకొన్నట్టే సినిమా ఆడలేదు. అప్పటికి నా ఇమేజ్ అంతంత మాత్రమే. అయినా నన్ను నెగిటీవ్ క్యారెక్టర్లలో చూడలేకపోయారు..” అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు చిరు.