మూడు రాజధానులు పెట్టేస్తాం…! మా ప్రాంతానికి రాజధాని వద్దా… వస్తే తొక్కేస్తాం… ! విశాఖ రాజధానికి మద్దతు తెలుపనోళ్లు ఉత్తరాంద్ర ద్రోహులు ! మనపైకి దండెత్తి వస్తుంటే నోరెత్తరా ? ఉత్తరాంద్రపై దండయాత్రే ! అంటూ.. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకులు గొంతు చించుకుంటున్నారు. అమరావతి రైతులు పాదయాత్రగా అరసవిల్లి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారనే వారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆ రైతుల్ని దోపిడి దొంగలంటున్నారు.. పెయిడ్ ఆర్టిస్టులంటున్నారు.. ఇంకా ఏవేవో అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల తాపత్రయం చూస్తే.. రేపో మాపో… మాకు ఇతర ప్రాంతాలతో సంబంధం లేదు.. మా రాష్ట్రాన్ని మాకు ప్రకటించేయండి అని ఉద్యమం ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. అంత వేడి అక్కడ కనిపిస్తోంది. అదే వేడి రాయలసీమలోనూ రానుంది. అక్కడ కూడా వైసీపీ నేతలు రాయలసీమ హైకోర్టు కోసం .. జేఏసీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ఇక అక్కడ కూడా కర్నూలు హైకోర్టును అడ్డుకుంటే అడ్డంగా నరికేస్తాం… పొడిచేస్తాం.. అనే ప్రకటనలు రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అటు ఉత్తరాంద్ర, ఇటు రాయలసీమ తమకు తమకు రాజధానులే కావాలంటే మాకు మాత్రం వద్దా అని కోస్తా ప్రజలు అనుకుంటే ముచ్చటగా.. మూడు రాష్ట్రాల ఉద్యమం ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే కలిసి ఉంటామనే వారు ఎవరూ ఉండరు. విడదీయమని అడిగే వారే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో జరిగినంత లొల్లి ప్రస్తుతం ఏపీని మూడు రాష్ట్రాలుగా చేయడంలో రాదు.
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన రాజకీయం !
కష్టమో..నష్టమో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయింది. అది తెలంగాణకు వెళ్లిపోయినంత మాత్రాన ప్రజలకు పోయిందేమీ లేదు. ఆంధ్రులు.. నిక్షేపంగా వ్యాపారాలు..ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఏపీకి కూడా ఓ రాజధాని ఉండాలి.. అది కూడా హైదరాబాద్‌లా ఆదాయం తెచ్చి పెట్టాలి అన్న ఆలోచనతో అమరావతికి గత ప్రభుత్వం రూపకల్పన చేసింది. నిజానికి ఇది చంద్రబాబు ఆలోచనో..జగన్ ఆలోచనో చెప్పలేం. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి.. తాను సీఎం అయితే ఎలాంటి రాజధానిని కడతారో ప్రజలకు ఓ కల చూపించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. అదంతా చంద్రబాబు … రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు తగ్గట్లుగానే ఉంది. రాజధాని విషయంలో జగన్, చంద్రబాబు ఆలోచనలు ఒకేలా ఉన్నాయనుకున్నారు. ఎవరు గెలిచినా అలాంటి రాజధాని వస్తుందనుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యారు. రైతులు సహకరించారు. ప్రపంచంలోనే అనితర సాధ్యమైన రీతిలో భూసమీకరణకు అంగీకరించారు. ముఫ్ఫై మూడు వేల ఎకరాలిచ్చారు. ఇదో అద్భుతం . గ్రీన్ ట్రిబ్యూనల్ కేసు… ప్రపంచ బ్యాంక్‌కు తప్పుడు ఫిర్యాదులు ఇలా అన్ని అడ్డంకులు అధిగమించి.. రెండేళ్లలో భూ సమీకరణ పూర్తి చేసి రాజధాని నిర్మాణం ప్రారంభించారు. మూడేళ్లో ఓ బస్టాండ్ కూడా ప్రభుత్వాలు కట్టలేని రోజుల్లో చాలా వరకూ రాజధాని నిర్మాణం పూర్తయింది. ఇక ప్రైవేటు పెట్టుబడులు వెలువలా రావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారింది. తన కలల రాజధాని ఎలా ఉంటుందో అంతకు ముందు చెప్పిన రాజకీయ నేతే సీఎం అయ్యారు. కానీ తాను ప్రారంభించలేదని చిందర వందర చేసేశాడు. ఇప్పుడు మిగిలింది ఏమీ లేదు. మూడు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు తప్ప. అమరావతి లేదు..విశాఖపట్నం లేదు..కర్నూలు లేదు.. ఉన్నదంతా బూడితే. విడిపోయిన తర్వాత కోలుకున్నామనుకునేంతలో.. కాలుతో తన్నేశారు. ఇప్పుడు ఏపీ కుక్కలు చింపిన విస్తరి అయిపోయింది.
రాజధానిపై అప్పట్లో అందరిదీ ఒకే మాట – ఇప్పుడు సిగ్గూశరం లేకుండా మార్పు !
అమరావతిని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఒక్కరంటే ఒక్కరూ వ్యతిరేకించలేదు. అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ తమ ప్రాంతానికి రాజధాని కావాలని ఒక్కరూ అడగలేదు. రాష్ట్రం మధ్యలో రాజధాని అంటే అందరూ బాగుందని అనుకున్నారు. వైసీపీ నేతలు.. జగన్ కూడా అంగీకరించారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే జగన్ .. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఇష్టం లేక అమరావతికి అంగీకరిస్తున్నానన్నారు. తన అంగీకారానికి గుర్తుగా ఇల్లు కట్టుకున్నారు. ఎన్నికల్లో ఆ ఇంటినే సాక్ష్యంగా చూపించారు. గెలిచిన తర్వాత అడ్డగోలుగా మాట మార్చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేశారు. విశాఖకు రాజధాని.. రాజధాని వస్తే అక్కడ … అభివృద్ధి అయిపోతుందని.. రెచ్చగొట్టడం ప్రారంభించారు. గత మూడేళ్లలో ఆయన రాష్ట్రంలో చేసిన అభివృద్ధేమిటో ప్రజలు కాస్త చూస్తే.. రాజధాని తీసుకొచ్చి చేసే అభివృద్ధి ఏమిటో కళ్ల ముందు కనిపిస్తుంది. గుడివాడ దగ్గర్నుంచి ధర్మాన వరకూ అందరూ ఎన్నికలకు ముందు మీడియా మైకుల దగ్గరకు వచ్చి.. రాజధాని మారుస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని..తాము రాగానే అమరావతిని రాకెట్ వేగంతో అభివృద్ది చేస్తామన్నారు. కానీ ఇవ్పుడు అవే నోళ్లు పూర్తిగా మారిపోయాయి. స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టడానకి కూడా వెనుకాడటం లేదు. వారి మాటలు వింటే… పదవి తెచ్చుకుని రెండు మూడేళ్లు .. కుర్చీలో కూర్చుంటారు..కానీ అందు కోసం రాష్ట్రాన్ని శాశ్వతంగా బలి చేస్తున్నారే.. ఇంత స్వార్థపరులు…వీరా మన పాలకులు అని అనిపించకమానదు. మంత్రి పదవి లేనప్పుడు ధర్మాన ప్రసాదరావు అనే రాజకీయ నాయకుడు.. తన శ్రీకాకుళం జిల్లాను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తామని అంటనే కస్సుమని లేఛారు. అది చాలా తప్పన్నారు. కానీ మంత్రి పదవి వచ్చే సరికి సిక్కోలును రెండు ముక్కలు చేయడానికి అంగీకరించారు.. ప్రజల మనసుల్లో విభజన బీజాలు నాటడానికి.. రెచ్చగొట్టడానికి ఉదయం ..సాయంత్రం సభలు..సమావేశాలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఈ విషయంలో ఒక్క ధర్మానే కాదు..వైసీపీ నేతలంతా ఇలా బరి తెగించిన వాళ్లే.
అమరావతిగా ఉంటే మళ్లీ విభజన వాదం వస్తుందని పాలకుల అతి తెలివి !
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే.. ఏపీ మూడు రాష్ట్రాలకు విడిపోతుందని ఓ వింత వాదనతో … మూడు రాజధానులంటున్నారు వైసీపీ నేతలు. కానీ ఇప్పుడు వారు చేస్తున్న రాజకీయంతో మూడు రాజధానులు దండగ… మూడు రాష్ట్రాలు అయితే మంచిదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి ప్రయత్నాల కన్నా.. ఎవరి దారి వారు ఇప్పుడే చూసుకుంటే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది ప్రజల్లో వస్తుందంటే అందులో ఎవరి తప్పు ఉందో ఆలోచించాలి ?. ఉత్తరాంధ్ర విడిపోతే.. విశాఖను రాజధానిగా చేసుకోవచ్చు.. రాయలసీమ విడిపోతే కర్నూలును రాజధానిగా చేసుకోవచ్చు. కోస్తా వాళ్లు అమరావతిని చేసుకుంటారో… లేకపోతే తమకు జిల్లాకో రాజధాని కావాలనకుుంటారో వాళ్లిష్టం. అలాంటి పరిస్థితే వస్తే.. తమ జిల్లాకో రాజధాని వద్దా అనే డిమాండ్లు రావన్న గ్యారంటీ లేదు.ఎందుకంటే ఇప్పటి పాలకులు మనసుల్లో నాటుతున్న విష బీజాలు అలాంటివే మరి. ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టే..జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఆవేదనేత ట్వీట్ పెట్టారు. యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రాగా ప్రతీ జిల్లాను ఓ రాష్ట్రంగా మార్చసి.. ప్రతీ జిల్లాకు ఓ ముఖ్యమంత్రిని..ఓ రాజధానిని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఇది ఆవేదనతో పెట్టినా అర్థం ఉంది. అమరావతి అభివృద్ధి చెందితే్.. ఇతర ప్రాంతాలు ఎందుకు నష్టపోతాయో..ఎవరూ చెప్పరు. అమరావతి అనేది రాష్ట్ర ప్రజల సొత్తు అవుతుంది. దాని నుంచి వచ్చే ఆదాయంతోనే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తారు . ఈ రోజు హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయంతోనే తెలంగాణ ప్రజలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అంతే కానీ.. హైదరాబాద్‌కే పెట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే… ఓ వర్గం ప్రజలకు పెట్టడం లేదు. కానీ అమరావతి అయితే 29 గ్రామాలది..విశాఖ అయితే ఉత్తరాంధ్రది..కర్నూలు అయితే రాయలసీమది.. ఇంకా కాకుండా… ఒక్క సామాజికవర్గానిదే అని ప్రచారం చేసే నికృష్ట రాజకీయానికి ఏపీ ఏనాడో బలైపోయింది.
కులం క్యాన్సర్‌ను ఏపీకి పట్టించేసిన దౌర్భాగ్య రాజకీయం !
కులం..కులం ప్రతీ దానికి కులం. ఈ కులం క్యాన్సర్ రాష్ట్ర పాలకులనే చుట్టేసి ఉంటే..దాన్ని అంటు వ్యాధిలా వారి పార్టీ నేతలందరికీ అంటించేశారు. చివరితి దోపిడీలు చేసి అడ్డగోలుగా దొరికినా… ఆ కులం వాళ్లకే ఎక్కువ భూములన్నాయనే వాదన తీసుకొస్తున్నారంటే.. వారు ఎంత బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. దోపిడీ దొంగలకు నీతి జాతి ఏమీ ఉండదు. వారి పని దొంగతనం చేయడం.. దొరికితే.. ఎదుటివారిపై బురద చల్లడం. ఇప్పుడు అదే జరుగుతోంది. రాజధాని పేరుతో వారు చేస్తున్న వికృత రాజకీయం..అధికారంలో ఉన్నామనే అహంకారం.. ఏదైనా చేయవచ్చనే ఆలోచనతో చెలరేగిపోతున్నారు. కొద్ది మంది ప్రజలకు.. ఓటు బ్యాంక్ అనుకున్న వారికి పప్పుబెల్లాలు పంచి ఏం చేసినా వారు మాకు ఓట్లేస్తారనే ధీమాతో రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు కల్పిస్తే చాలు రాష్ట్రం గురించి ఎవరూ పట్టించుకోరన్న ఓ నమ్మకంతో ముందుకెళ్తున్నారు. గత ఎన్నికలకు ముందు చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మిన ప్రజలు..ఇప్పుడు తాము చెప్పేది ఎందుకు నమ్మరన్న ధీమా కావొచ్చు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి అయినా సరే.. అధికారాన్ని నిలపెట్టుకోవాలన్న తాపత్రయంతో ముందుకు పోతున్న పాలకులు..రాజకీయనేతలు ఇప్పుడు ప్రజల ఆలోచనాశక్తికే సవాల్ విసురుతున్నారు.
సాధ్యం కాని మూడు రాజధానులతో మాయ.. అంతిమంగా జరిగేది మూడు రాష్ట్రాల ఏర్పాటే !
రాజ్యాంగం..చట్టం ప్రకారం మూడురాజధానులు పెట్టలేరు. ఎందుకంటే.. స్వయంగా సీఎం జగన్ తానే పాస్ చేసిన బిల్లును వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీలో మరో బిల్లు పాస్ చేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఏపీ అసెంబ్లీకి ఆ హక్కు లేదని తేల్చేసింది. ప్రభుత్వానికి ఇక ఏ మార్గమూ లేదు. రైతులకురూ. లక్ష కోట్ల నష్టపరిహారం చెల్లించి.. తాము చేయాలనుకున్నది చేయవచ్చు. మరోసారి గెల్చినా ఈ మూడు రాజధానులు అలాగే ఉంటాయి. కానీ ప్రజల మధ్య పెట్టిన ఈ చిచ్చు మాత్రం ఇప్పుడల్లా చల్లారేది కాదు. ఓ ఐదేళ్లు..పదేళ్ల తర్వాతైనా.. మా రాష్ట్రం మాకు కావాలని మూడు ప్రాంతాల ప్రజలూ పోరాటాలు చేస్తారు. అందుకే ఈ బాధలేమీ లేకుండా ఇప్పుడే మూడు రాష్ట్రాలను చేసి..మూడు రాజధానుల్ని కట్టేసి… కథకు ముగింపునివ్వాలి. ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వాలి.