ఇష్టారీతిన రిషికొండను తవ్వేసి ఇప్పుడు పాపం బయటపడే పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం అడ్డగోలు వాదనలు చేస్తోంది. అదనంగా తవ్విన కొండను మళ్లీ కడతామని చెబుతోంది. హైకోర్టులో ప్రభుత్వ లాయర్ నిరంజన్ రెడ్డి చేసిన వాదన ఇంతే ఉంది. రిషికొండ తవ్వాకలపై హైకోర్టులో జరిగిన వాదనల్లో తాము మళ్లీ రిషికొండను నిర్మిస్తామని చెప్పిన అంశం హైలెట్ అవుతోంది. కొండలను అడ్డగోలుగా తవ్వేసి… బోడిగుండు చేసేసి ఇప్పుడు.. పకల మీదకు వచ్చే సరికి.. మళ్లీ నిర్మిస్తామన్న అడ్డగోలు వాదనను కూడా వినిపించడం ప్రారంభించారు.
కొండలను నిర్మించడం సాధ్యమేనా అని హైకోర్టుకూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ వాదన ప్రకారం.. చూస్తే నిబంధనలను పూర్తి స్థాయిలో ఉల్లంఘించారని అర్థం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి పనులు చేపట్టారు. అందుకే న్యాయాధికారులతో కమిటీని కూడా ప్రభుత్వం వద్దంటోంది. న్యాయాధికారులపైనా ప్రభుత్వ న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే అఫిడవిట్‌నే నమ్మాలన్నట్లుగా దబాయించే ప్రయత్నం చేశారు . అయితే కోర్టు ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు.
ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత అసలు విషయాన్ని తేల్చే అవకాశం ఉంది . అప్పుడు ప్రభుత్వ పెద్దలు సేఫ్‌గానే ఉంటారు కానీ.. అధికారులు మాత్రం బలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ పనుల పరిశీలనకు ఎవరినీ పంపలేదు.. వెళ్లిన వారిపై కేసులు కూడా పెట్టారు. ఇవన్నీ వారి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందంి.