తెలంగాణను కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఇప్పటికే సీబీఐ, ఈడీలు సోదాలు చేశాయి. అరెస్టులు ప్రారంభించాయి. ఇప్పుడు రంగంలోకి ఐటీ దిగింది. పెద్ద ఎత్తున ఐటీ బృందాలు ఒక్క సారిగా హైదరాబాద్లో సోదాలు చేశాయి. ఈ సారి వారి టార్గెట్ పెద్ద పెద్ద కంపెనీలు కాదు. ఆర్ఎస్ బ్రదర్స్ , సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లాట్ మొబైల్స్ వంటి దుకాణాల్లో సోదాలు చేశారు. దుకాణాలతో పాటు గోడౌన్లలో కూడా సోదాలు చేశారు. లోపల సిబ్బందిని బయటకి…బయట సిబ్బంది లోపలకి అనుమతించలేదు. ఏ కేసులో సోదాలు చేస్తున్నరో కూడా ఎవరికీ తెలియదు.
తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కొంత మంది పెద్ద ఎత్తున హవాలా నగదు తరలించడానికి ఇలాంటి వ్యాపార సంస్తలను ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐటీ అధికారులు ఆధారాలు లభించడంతోనే దాడులు చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన వారి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పుడు బట్టలు, నగల దుకాణాలు.. సెల్ ఫోన్ దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా ఆదాయపు పన్ను శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలువురు ఐటీ అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులు చార్జ్ తీుకుని.. సోదాలు ప్రారంభించారు. మొత్తంగా దర్యాప్తు సంస్థలన్నీ వరుసగా జరుపుతున్న దాడులు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయని.. అతి పెద్ద స్కాం బయటపడుతుందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.