కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ . తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి హరీష్ రావు మాట్లాడారు. దాంతో ఆయన టీఆర్ఎస్లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లి మాట్లాడారు. దాంతో ఆయన బీజేపీకి వెళ్తారని చెప్పుకున్నారు. ఒకే సామాజికవర్గం కావడంతో రాజేందర్ పిలిచాడైనా వెళ్తారని అనుకున్నారు. కానీ కాసాని ఏం ఆలోచించాడో కానీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.
టీడీపీలో చేరాలని ఉందని ఆయన సమాచారం పంపడం.. దానికి చంద్రబాబు అంగీకరించడం జరిగిపోయాయి. అసలు తెలంగాణలో టీడీపీ ఉందో లేదో అనుకునే పరిస్థితి. నేతలంతా పోవడమే కానీ చేరేవారు లేరు. కానీ ఇటీవల టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ మారిన తర్వాత తెలంగాణలోని కొంత మంది నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. మునుగోడు టిక్కెట్ ఇస్తే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేరుతారని చెప్పుకున్నారు.
కానీ వచ్చే ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు… మునుగోడు ఉపన్నికలో పోటీకి ఆసక్తి చూపించలేదు.దాంతో ఆయన చేరలేదు. ఇప్పుడు కాసాని చేరుతున్నారు. మరికొంత మంది కూడా వచ్చి చేరితే.. టీడీపీ మళ్లీ యాక్టివ్ అవుతుందన్న సంకేతాలు వస్తాయి. అయితే కాసానికి కండువా కప్పడానికి అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ రెడీగా ఉన్నా.. ఆయన కావాలని టీడీపీలో ఎందుకు చేరారో మరి. కాసాని ఒకప్పుడు టీడీపీలోనే వెలుగు వెలిగిన నేతే.