ఎన్నికలు ఎప్పుడు ఎలా నిర్వహించాలో ఈసీ ఇష్టం. అందులో మరో ఉద్దేశానికి తావు లేదు. అందుకే నెల వ్యవధిలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీల గడువు పూర్తవుతున్నా.. కేవలం హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి అక్కడ కోడ్ అమల్లోకి వచ్చేలా చేశారు. కానీ గుజరాత్‌కు మాత్రం షెడ్యూల్ ప్రకటించలేదు. ఎందుకంటే.. అక్కడ మరో నెల గడువుందట. సాధారణంగా ఇలా.. నెలా.. రెండు నెలల గ్యాప్ ఉంటే.. ఎన్నికలసంఘం అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే సారి షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆరు నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ అధికారం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం సంప్రదాయాన్ని మార్చేశారు.
హిమాచల్ అసెంబ్లీ టెర్మ్ 2023 జనవరి 8న, గుజరాత్ అసెంబ్లీ టెర్మ్ 2023 ఫిబ్రవరి 18న ముగుస్తాయి. నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం మరొక దానిపై ప్రభావం చూపకుండా ఉండాలంటే కనీసం 30 రోజులు గ్యాప్ ఉండాలని ఈసీ చెబుతోంది. అందుకే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ముందుగా ప్రకటించినట్లుగా చెబుతున్నారు. మరి గతంలో ఇలాంటి నిబంధనలు లేవా అంటే ఉన్నాయి.. కానీ ఇప్పుడే అవసరానికి అమలు చేస్తారన్నమాట.
ఈసీ షెడ్యూల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 12న జరుగనున్నాయి. అయితే సుమారు నెల తర్వాత డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడిస్తారు. మరి ఇంత గ్యాప్ ఎందుకంటే… కొద్ది రోజులు పోయాక.. గుజరాత్లో బీజేపీ అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత షెడ్యూల్ ప్రకటించి.. అదే రోజున గుజరాత్ ఫలితాలు కూడా వచ్చేలా షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. లేకపోతే కౌంటింగ్‌కు నెల రోజుల గ్యాప్ పెట్టాల్సిన అవసరం ఏముందనేది మరో ప్రశ్న. అదేసమయంమలో అన్ని రోజులు అంటే… ఈవీఎంల భద్రతపైనా సందేహాలొస్తాయి. అయిినా ఈసీ తాను చేయాలనుకున్నది చేస్తోంది.