వీఆర్ఏలు తమకు పే స్కేలు కల్పించాలని చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. వారు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని మండిపడ్డారు.ఇటీవల వరంగల్ పర్యటనకు వెళ్తే .. వినతి పత్రం ఇస్తే.. మొహం మీద కొట్టారని వారే అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ముట్టడి నిర్వహించడం కలకలం రేపింది. అప్పట్లో నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు కానీ మర్చిపోయారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా వారి ఆందోళన మరింత ఎక్కువ అవుతూండటంతో మరోసారి వారికి గిలిగింతలు పెట్టాలని నిర్ణయించుకుంది.
ప్రస్తుతం సమ్మెలో ఉన్న వీఆర్ఏలను.. సీఎస్ సోమేష్ కుమార్ పిలిపించుకున్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తక్షణం సమ్మె విరమించాలన్నారు. పేస్కేలు కూడా ప్రటిస్తామన్నారు. అయితే ఇక్కడ చిన్న షరతు పెట్టారు.. అదేమిటంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికలయ్యాక.. ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీంతో వీఆర్ఏలు సమ్మెను ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించారు. పాలాభిషేకాలు చేస్తారేమో కానీ.. అసలు ఎన్నికలైన తర్వాత పట్టించుకుంటారా అనే డౌట్ కూడా వారికి ఉంది.
ఇప్పటి వరకూ ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.. ఇప్పుడు మాత్రం ఎలా అని అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు హామీ ఇచ్చింది సీఎస్… నేరుగా ఎలాంటి ప్రక్రియ లేకుండా హామీ ఇచ్చారు. మంత్రి లేదా సీఎం స్థాయిలో నిర్ణయం లేకుండా సీఎస్ కూడా చేయలేరు. అందుకే నమ్మడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో వీఆర్ఏలో ఓకే అనేసి బయటకు వచ్చారు. ఎన్నికలు అయిపోయాక చూసుకోవాలనుకుంటున్నారు.