ఏపీ మంత్రి అప్పలరాజను మావోయిస్టులు పదే పదే బెదిరిస్తున్నారు. గతంలో తాము ఎటాక్ చేసిన ఘటనలు గుర్తు చేసి మరీ బెదిరిస్తున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే రెండులేఖలు జారీ అయ్యాయి. సిక్కోలు జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే .. ఇటీవల మంత్రి అయ్యారు. అవడానికి డాక్టర్ అయిన ఆయన తీరు రాజకీయంగా అథమస్థాయిలో ఉంటుంది. ఆయనే చేస్తున్నారో ఆయనను అడ్డం పెట్టుకుని అనుచరులే చేస్తున్నారో కానీ పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతూ.. సామాన్యుల్ని ఇబ్బందులు పెడుతున్నారు.
ఈ కారణంగా ఆయనకు మావోయిస్టుల నుంచి హెచ్చరిక లేఖ వచ్చింది. దాన్ని అప్పలరాజు పట్టించుకోలేదు. ప్రభుత్వం సెక్యూరిటీ పెంచడంతో మరింతగా రెచ్చిపోయారు. దీంతో రెండో సారి అప్పలరాజుకు మావోయిస్టులు లేఖలు రాశారు. ఉత్తరాంధ్రలో మన్యంలో వైసీపీ నేతలు ఇంకా చెలరేగిపోతున్నా..వారికి మావోయిస్టుల నుంచి హెచ్చరికలేఖలు రావడం లేదు.. కానీ అప్పలరాజుకే ఎందుకు వస్తున్నాయో పోలీసులు అంచనా వేయలేకపోతున్నారు.
పోలీసులు అధికారులు ఎలాగూ మావోయిస్టులు చెప్పే భూ అక్రమాలపై చర్యలు తీసుకోరు.. కనీసం మావోయిస్టుల పేరుతో వస్తున్న లేఖల గురించైనా చర్యలు తీసుకుంటారా అన్నదే సందేహం. పలాసలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు పెద్దగా లేవు.అసలు పలాసలోనే కాదు..రాష్ట్రంలోనే లేవని పోలీసులు చెబుతున్నారు. మరి అప్పలరాజునే ఎందుకు టార్గెట్ చేసుకున్నారన్నది తేలాల్సి ఉంది.