అనుదీప్ కెవి పదేళ్ళ నుంచి ఇండస్ట్రీలో వున్నాడు. అయితే బ్రేక్ ఇచ్చింది ‘జాతిరత్నాలు’. కరోనా సమయంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ కి కొత్త ఉత్సాహం తెచ్చింది. అయితే ఈ చిత్రంలో దర్శకుడిగా అనుదీప్ తెలిసింది కానీ క్రిడెట్ అంతా నవీన్ పోలిశెట్టి ఖాతాలో పడింది. ఒక మామూలు కామెడీ కథని కూడా నవీన్ తన ప్రతిభతో బ్లాక్ బస్టర్ చేశాడని అందరూ నవీన్ స్టామినా గురించే మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అనుదీప్ కి ఒక ఫ్లాప్ పడింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి దర్శకత్వం తప్పా అన్నీ అనుదీపే. అయితే ఈ సినిమా ఫస్ట్ డేనే ఊసులేకుండా పోయింది. దీంతో రచయిత, షో రన్నర్ గా ఒక ఫ్లాఫ్ ని మూటకట్టుకున్నాడు అనుదీప్.
అయితే ఇప్పుడు అనుదీప్ కి ‘ప్రిన్స్’ రూపంలో యాసిడ్ టెస్ట్ ఎదురుకానుంది. శివకార్తికేయన్ హీరోగా ద్విభాష చిత్రంగా దిన్ని తెరకెక్కించారు. ట్రైలర్ చూసిన తర్వాత తెలుగు దర్శకుడు ఉన్నాడనే మార్కెట్ ట్రిక్కు పై ప్రిన్స్ ని ద్విభాష చిత్రం అనే ప్రచారం చేశారు కానీ ఇది పక్కా తమిళ సినిమానే సంగతి తేలిపోయింది. అందరూ తమిళ నటులే వున్నారు. అయితే శివకార్తికేయాన్ గత చిత్రాలు తెలుగులో కొంత పర్వాలేదనిపించాయి. ప్రిన్స్ ట్రైలర్ లో అనుదీప్ మార్క్ డైలాగులు కొన్ని పేలాయి. అలాగే ప్రిన్స్ కి మంచి పాటలు ఇచ్చాడు తమన్. అవన్నీ సానూకుల అంశాలే. అయితే దీపావళికి దాదాపు అరడజను సినిమాలు బాక్సాఫీసు ముందుకు వస్తున్నాయి. సర్దార్, జిన్నా, ఓరిదేవుడా సినిమాల రూపంలో ప్రిన్స్ కి గట్టిపోటి వుంది. ఈ పోటిని తట్టుకొని ప్రిన్స్ నిలబడాలి. మొత్తానికి దర్శకుడిగా అనుదీప్ కి ఇది అసలు సిసలైన పరీక్ష.